Lafarge
-
లఫార్జ్ భారత చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియ
ముంబై : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ లఫార్జ్ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియ నియమితులయ్యారు. ఇదివరకు కంపెనీ భారత కార్యకలాపాలను మార్టిన్ రిగ్నర్ పర్యవేక్షించేవారు. ఉజ్వల్ భర్తియ గత 16 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన గతంలో లఫార్జ్ భారత మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. -
లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్!
డీల్‌ను తిరస్కరించిన హోల్సిమ్ బోర్డు జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలైన హోల్సిమ్, లఫార్జ్‌ల మధ్య కుదిరిన మెగా విలీనానికి బ్రేకులు పడ్డాయి. 40 బిలియన్ డాలర్ల ఈ ప్రతిపాదిత డీల్‌ను ఇప్పుడున్న ప్రకారం ఒప్పుకోబోమని స్విట్జర్లాండ్ సంస్థ హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు తిరస్కరించింది. అంతేకాకుండా విలీనం తర్వాత పాలనాపరమైన అంశాలపైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇరు కంపెనీలకూ భారత్‌లో గణనీయమైన స్థాయిలోనే సిమెంట్ కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విలీన డీల్‌కు భారత్ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది కూడా. ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్, హోల్సిమ్‌లు తమ విలీన ప్రణాళికలను 2014 ఏప్రిల్‌లో ప్రకటించాయి. ఈ విలీనంతో 90 దేశాల్లో కార్యకలాపాలతో పాటు 40 బిలియన్ డాలర్ల అమ్మకాలు గల సంస్థ ఆవిర్భవించనుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ గ్రూప్‌గా కూడా అవతరించనుంది. పాలనా పరమైన అంశాలతో పాటు షేర్ల ఎక్స్ఛేంజ్ రేషియో విషయంలో కూడా మరింతగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంబినేషన్ ఒప్పందాన్ని ఇక పరిగణనలోకి తీసుకోబోమని సమావేశంలో నిర్ణయించినట్లు హోల్సిమ్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైలో ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు విలీనానికి సంబంధించి ఈ కాంబినేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాగా, ఈ విలీనాన్ని సాకారం చేసేందుకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని... ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ఏవైనా సవరణలకు ఆస్కారం ఉంటుందని లఫార్జ్ కూడా మరో ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకానీ ఇప్పుడున్న ఒప్పందాల్లో ఇతరత్రా ఎలాంటి మార్పులను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. -
సిమెంట్ రారాజుగా లఫార్జ్‌హోల్సిమ్
జ్యూరిక్/న్యూఢి ల్లీ: అంతర్జాతీయ దిగ్గజాలు హోల్సిమ్(స్విట్జర్లాండ్), లఫార్జ్(ఫ్రాన్స్) విలీన ప్రతిపాదన కారణంగా ప్రపంచ సిమెంట్ రారాజుగా విలీన సంస్థ లఫార్జ్‌హోల్సిమ్ ఆవిర్భవించనుంది. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఏకగ్రీవంగా సమ్మతించాయి. కీలక వాటాదారులు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెరసి లఫార్జ్‌హోల్సిమ్ 90 దేశాలలో కార్యకలాపాలు కలిగిన సిమెంట్ దిగ్గజంగా నిలవనుంది. విలీన సంస్థ టర్నోవర్ 32 బిలియన్ యూరోలు(44 బిలియన్ డాలర్లు)కాగా, ఏ ఒక్క దేశం నుంచీ ఆదాయంలో 10% మించి వాటా లేకపోవడం గమనార్హం. కొత్తగా ఏర్పడనున్న లఫార్జ్‌హోల్సిమ్ కేంద్ర స్థానం స్విట్జర్లాండ్‌లో కొనసాగనుండగా, హోల్సిమ్ చైర్మన్ ఉల్ఫ్‌గాంగ్ రీట్జిల్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక లఫార్జ్ సీఈవో బ్రూనో లఫాంట్ గ్రూప్ సీఈవో బాధ్యతలు చేపడతారు. సిమెంట్, కాంక్రీట్ విభాగాలలో కొత్త కంపెనీ నెంబర్‌వన్‌గా ఆవిర్భవిస్తుందని రెండు సంస్థలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఇండియాలోనూ నంబర్‌వన్ ప్రపంచ దిగ్గజాల విలీనం నేపథ్యంలో అనుబంధ సంస్థల ద్వారా దేశీయంగానూ లఫార్జ్, హోల్సిమ్ సిమెంట్ రంగంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. దేశీ దిగ్గజ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్లను సొంతం చేసుకోవడం ద్వారా హోల్సిమ్ ఇండియాలో భారీ స్థాయి కార్యకలాపాలను అందుకోగా, 1999లో టాటా స్టీల్‌కు గల సిమెంట్ ప్లాంట్ కొనుగోలు ద్వారా దేశీయ సిమెంట్ బిజినెస్‌లోకి లఫార్జ్ ప్రవేశించింది. హోల్సిమ్ సొంతం చేసుకున్న ఏసీసీ, అంబుజా సిమెంట్ సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం 58.5 మిలియన్ టన్నులుకాగా, దేశవ్యాప్తంగా పలుచోట్ల సిమెంట్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి. ఇక 2001లో రేమండ్ సిమెంట్ ప్లాంట్‌ను కూడా కొనుగోలు చేసిన లఫార్జ్ ప్రస్తుతం నాలుగు సిమెంట్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా తూర్పు, మధ్య భారత ప్రాంతాలలో కాన్సెర్టో, డ్యురాగార్డ్ బ్రాండ్ల ద్వారా అమ్మకాలను విస్తరించింది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లో గల నాలుగు ప్లాంట్ల ద్వారా మొత్తం 8 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో 66 మిలియన్ టన్నులకుపైగా సామర్థ్యంతో ఇండియాలోనూ లఫార్జ్‌హోల్సిమ్ గ్రూప్ నంబర్‌వన్‌గా అవతరించనుంది. ఇది మొత్తం దేశ సిమెంట్ సామర్థ్యం 368 మిలియన్ టన్నులలో 18%కు సమానం. కాంపిటీషన్ కమిషన్ కన్ను? ల ఫార్జ్, హోల్సిమ్ విలీనం వల్ల దేశీయంగా కీలక ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమను ఒకే గ్రూప్ నియంత్రించేందుకు అవకాశమేర్పడనుంది. గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే బాటలో విలీన సంస్థకు సంబంధించిన కొన్ని ప్లాంట్లను విక్రయించమంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. లఫార్జ్, హోల్సిమ్ విలీనం వల్ల దేశవ్యాప్తంగా కొన్ని కీలక ప్రాంతాలలో సిమెంట్ ధరలను నియంత్రించేందుకు కూడా వీలు చిక్కుతుందని పేర్కొన్నాయి. ఇదికాకుండా 200 మిలియన్ టన్నుల సామర్థ్యం ఆరు సిమెంట్ కంపెనీల చేతిలోనే ఉండనుంది. లఫార్జ్, హోల్సిమ్ బాటలో ఇప్పటికే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ ఉత్పాదక సామర్థ్యం సైతం దాదాపు 60 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకుంది. ఇందుకు ఇటీవల జేపీ సిమెంట్ గుజరాత్ ప్లాంట్‌ను సొంతం చేసుకోవడం కూడా కొంతమేర దోహదపడింది. దేశీయంగా సిమెంట్‌కు ప్రత్యేకత ఉన్నదని, ప్రాంతీయంగానూ కీలక పాత్రను పోషిస్తుందని, దీంతో సీసీఐ తప్పనిసరిగా డీల్పట్ల తగు పరిశీలన చేపడుతుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విలీన వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో అంబుజా సిమెంట్స్ 2.7% ఎగసి రూ. 209 వద్ద, ఏసీసీ 1% లాభంతో రూ. 1,375 వద్ద, అల్ట్రాటెక్ సిమెంట్ 3.2% జంప్‌చేసి రూ. 2,220 వద్ద ముగిశాయి. -
ప్రపంచ సిమెంట్ దిగ్గజాల విలీనం!
జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలు విలీనమయ్యేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు ఫ్రెంచ్ కంపెనీ లఫార్జ్తో స్విట్జర్లాండ్ దిగ్గజం హోల్సిమ్ చర్చలు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటికే చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు దిగ్గజాల బలాలు, బలహీనతలను లెక్కలోకి తీసుకుని విలీన ప్రతిపాదనను సిద్ధం చేయనున్నట్లు హోల్సిమ్ ప్రతినిధి మీడియాకు వెల్లడిం చారు. చర్చలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. 50 బిలియన్ డాలర్ల కంపెనీ ల ఫార్జ్, హోల్సిమ్ విలీనమైతే వీటి సంయుక్త విలువ 50 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3 లక్షల కోట్లు)కు చేరుతుంది. ప్రపంచ సిమెంట్ రారాజుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ వార్తల నేపథ్యంలో ప్యారిస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లఫార్జ్ షేరు 10% జంప్‌చేయగా, జ్యూరిక్ ఎక్స్ఛేంజీలో హోల్సిమ్ షేరు 8% పుంజుకుంది. లఫార్జ్, హోల్సిమ్ రెండూ భారత్‌లో కూడా సబ్సిడరీల ద్వారా కార్యకలాపాలను విస్తరించాయి. 1999లో టాటా స్టీల్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్ కొనుగోలు ద్వారా దేశీయ సిమెంట్ బిజినెస్‌లోకి లఫార్జ్ ప్రవేశించింది 2001లో రేమండ్ సిమెంట్ ప్లాంట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 4 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా తూర్పు, మధ్య భారత ప్రాంతాలలో కాన్సెర్టో, డ్యురాగార్డ్ బ్రాండ్లతో అమ్మకాలను విస్తరించింది. మొత్తం దేశీ తయారీ సామర్థ్యం 8 మిలియన్ టన్నులు. హోల్సిమ్ దూకుడు దేశీ దిగ్గజ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్లను 2005లో టేకోవర్ చేయడం ద్వారా హోల్సిమ్ భారత్‌లోకి దూసుకొచ్చింది. విడిగా ఏసీసీ సిమెంట్ తయారీ సామర్థ్యం 27.25 మిలియన్ టన్నులుకాగా, అంబుజా 25 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటికి దేశవ్యాప్తంగా పలుచోట్ల సిమెంట్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయంగా దిగ్గజాల సామర్థ ్యమిదీ... 2013లో హోల్సిమ్ అమ్మకాలు 22.11 బిలియన్ డాలర్లు(19.72 బిలియన్ స్విస్ ఫ్రాంకులు). ఇక లఫార్జ్ 20.81 బిలియన్ డాలర్లు(15.20 బిలియన్ యూరోలు) అమ్మకాలను సాధించింది. హోల్సిమ్ సిమెంట్ తయారీ సామర్థ్యం 217 మిలియన్ టన్నులు. లఫార్జ్ సిమెంట్ తయారీ సామర్థ్యం 137 మిలియన్ టన్నులు. 70 దేశాలలో కార్యకలాపాలు కలిగిన హోల్సిమ్లో 71,000 మంది పనిచేస్తున్నారు. 64 దేశాలలో విస్తరించిన లఫార్జ్ 65,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.