ప్రపంచ సిమెంట్ దిగ్గజాల విలీనం! | Holcim Talks About $40 Billion Cement Merger With Lafarge | Sakshi
Sakshi News home page

ప్రపంచ సిమెంట్ దిగ్గజాల విలీనం!

Published Sat, Apr 5 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

ప్రపంచ సిమెంట్ దిగ్గజాల విలీనం!

ప్రపంచ సిమెంట్ దిగ్గజాల విలీనం!

 జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలు విలీనమయ్యేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు ఫ్రెంచ్ కంపెనీ లఫార్జ్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం హోల్సిమ్ చర్చలు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటికే చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు దిగ్గజాల బలాలు, బలహీనతలను లెక్కలోకి తీసుకుని విలీన ప్రతిపాదనను సిద్ధం చేయనున్నట్లు హోల్సిమ్ ప్రతినిధి మీడియాకు వెల్లడిం చారు.  చర్చలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు.

 50 బిలియన్ డాలర్ల కంపెనీ
 ల ఫార్జ్, హోల్సిమ్ విలీనమైతే వీటి సంయుక్త విలువ 50 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3 లక్షల కోట్లు)కు చేరుతుంది. ప్రపంచ సిమెంట్ రారాజుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.  ఈ వార్తల నేపథ్యంలో ప్యారిస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లఫార్జ్ షేరు 10% జంప్‌చేయగా, జ్యూరిక్  ఎక్స్ఛేంజీలో హోల్సిమ్ షేరు 8% పుంజుకుంది.  లఫార్జ్, హోల్సిమ్ రెండూ భారత్‌లో కూడా సబ్సిడరీల ద్వారా కార్యకలాపాలను విస్తరించాయి.  

 1999లో టాటా స్టీల్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్ కొనుగోలు ద్వారా దేశీయ సిమెంట్ బిజినెస్‌లోకి లఫార్జ్ ప్రవేశించింది 2001లో రేమండ్ సిమెంట్ ప్లాంట్‌ను సొంతం చేసుకుంది.  ప్రస్తుతం 4 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా తూర్పు, మధ్య భారత ప్రాంతాలలో కాన్‌సెర్టో, డ్యురాగార్డ్ బ్రాండ్లతో అమ్మకాలను విస్తరించింది. మొత్తం దేశీ తయారీ సామర్థ్యం 8 మిలియన్ టన్నులు.
 
 హోల్సిమ్ దూకుడు
 దేశీ దిగ్గజ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్‌లను 2005లో టేకోవర్ చేయడం ద్వారా హోల్సిమ్  భారత్‌లోకి దూసుకొచ్చింది. విడిగా ఏసీసీ సిమెంట్ తయారీ సామర్థ్యం 27.25 మిలియన్ టన్నులుకాగా, అంబుజా 25 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటికి దేశవ్యాప్తంగా పలుచోట్ల సిమెంట్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి.
 
 అంతర్జాతీయంగా దిగ్గజాల సామర్థ ్యమిదీ...
   2013లో హోల్సిమ్ అమ్మకాలు  22.11 బిలియన్ డాలర్లు(19.72 బిలియన్ స్విస్ ఫ్రాంకులు).

   ఇక లఫార్జ్  20.81 బిలియన్ డాలర్లు(15.20 బిలియన్ యూరోలు) అమ్మకాలను సాధించింది.

   హోల్సిమ్ సిమెంట్ తయారీ సామర్థ్యం 217 మిలియన్ టన్నులు.

   లఫార్జ్ సిమెంట్ తయారీ సామర్థ్యం 137 మిలియన్ టన్నులు.

   70 దేశాలలో కార్యకలాపాలు కలిగిన హోల్సిమ్‌లో 71,000 మంది పనిచేస్తున్నారు.

   64 దేశాలలో విస్తరించిన లఫార్జ్ 65,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement