పొగను పీల్చుకునే ఫ్యాక్టరీ
ఈ శతాబ్దం అంతానికి భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువగానే ఉంచాలని ప్రపంచదేశాలు కూడా ప్యారిస్ ఒప్పందం ద్వారా అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే క్లైమ్ వర్క్స్ అభివృద్ధి చేసిన ఈ ఫ్యాక్టరీకి ప్రాముఖ్యం ఏర్పడింది. మూడు షిప్పింగ్ కంటెయినర్ల సైజుండే ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 900 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను వేరు చేయగలదు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఓ 7.50 లక్షలు ఏర్పాటు చేస్తే భూతాపోన్నతిని విజయవంతంగా అడ్డుకోవచ్చునని అంటున్నాడు... క్లైమ్ వర్క్స్ డైరెక్టర్ క్రిస్టోఫ్ గెబాల్డ్. బాగానే ఉందిగానీ.. వేరు చేసిన కార్బన్‌డైయాక్సైడ్ వాయువును ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. అబ్బో అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయంటున్నారు ఆయన.
‘‘మా ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వాయువును అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఓ గ్రీన్‌హౌస్‌కు అమ్ముతున్నాం. వాళ్లు దాన్ని పంటలు ఏపుగా పెరిగేందుకు వాడుతున్నారు’’ అంటారు ఆయన. దీంతోపాటు ఈ వాయువును కూల్‌డ్రింక్స్, లేదా ఇంధనం తయారీకి కూడా వాడుకోవచ్చునని చెబుతున్నారు. ఇంకో ఎనిమిదేళ్లకు అంటే... 2025 నాటికల్లా భూమ్మీద ఉన్న గాలిలో కనీసం ఒకశాతాన్ని శుద్ధి చేయాలన్నది క్లైమ్ వర్క్స్’ లక్ష్యమట! గుడ్‌లక్ చెప్పేద్దాం!