సిమెంట్ రారాజుగా లఫార్జ్‌హోల్సిమ్ | Holcim, Lafarge agree to merger to create cement giant | Sakshi
Sakshi News home page

సిమెంట్ రారాజుగా లఫార్జ్‌హోల్సిమ్

Published Tue, Apr 8 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

సిమెంట్ రారాజుగా లఫార్జ్‌హోల్సిమ్

సిమెంట్ రారాజుగా లఫార్జ్‌హోల్సిమ్

 జ్యూరిక్/న్యూఢి ల్లీ: అంతర్జాతీయ దిగ్గజాలు హోల్సిమ్(స్విట్జర్లాండ్), లఫార్జ్(ఫ్రాన్స్) విలీన ప్రతిపాదన కారణంగా ప్రపంచ సిమెంట్ రారాజుగా విలీన సంస్థ లఫార్జ్‌హోల్సిమ్ ఆవిర్భవించనుంది. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఏకగ్రీవంగా సమ్మతించాయి. కీలక వాటాదారులు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెరసి లఫార్జ్‌హోల్సిమ్ 90 దేశాలలో కార్యకలాపాలు కలిగిన సిమెంట్ దిగ్గజంగా నిలవనుంది. విలీన సంస్థ టర్నోవర్ 32 బిలియన్ యూరోలు(44 బిలియన్ డాలర్లు)కాగా, ఏ ఒక్క దేశం నుంచీ ఆదాయంలో 10% మించి వాటా లేకపోవడం గమనార్హం. కొత్తగా ఏర్పడనున్న లఫార్జ్‌హోల్సిమ్ కేంద్ర స్థానం స్విట్జర్లాండ్‌లో కొనసాగనుండగా, హోల్సిమ్ చైర్మన్ ఉల్ఫ్‌గాంగ్ రీట్జిల్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక లఫార్జ్ సీఈవో బ్రూనో లఫాంట్ గ్రూప్ సీఈవో బాధ్యతలు చేపడతారు. సిమెంట్, కాంక్రీట్ విభాగాలలో కొత్త కంపెనీ నెంబర్‌వన్‌గా ఆవిర్భవిస్తుందని రెండు సంస్థలూ సంయుక్తంగా ప్రకటించాయి.

 ఇండియాలోనూ నంబర్‌వన్
 ప్రపంచ దిగ్గజాల విలీనం నేపథ్యంలో అనుబంధ సంస్థల ద్వారా దేశీయంగానూ లఫార్జ్, హోల్సిమ్ సిమెంట్ రంగంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. దేశీ దిగ్గజ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్‌లను సొంతం చేసుకోవడం ద్వారా హోల్సిమ్ ఇండియాలో భారీ స్థాయి కార్యకలాపాలను అందుకోగా, 1999లో టాటా స్టీల్‌కు గల సిమెంట్ ప్లాంట్ కొనుగోలు ద్వారా దేశీయ సిమెంట్ బిజినెస్‌లోకి లఫార్జ్  ప్రవేశించింది. హోల్సిమ్ సొంతం చేసుకున్న ఏసీసీ, అంబుజా సిమెంట్ సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం 58.5 మిలియన్ టన్నులుకాగా,  దేశవ్యాప్తంగా పలుచోట్ల సిమెంట్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి.

ఇక 2001లో రేమండ్ సిమెంట్ ప్లాంట్‌ను కూడా కొనుగోలు చేసిన లఫార్జ్ ప్రస్తుతం నాలుగు సిమెంట్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా తూర్పు, మధ్య భారత ప్రాంతాలలో కాన్‌సెర్టో, డ్యురాగార్డ్ బ్రాండ్ల ద్వారా అమ్మకాలను విస్తరించింది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్‌లో గల నాలుగు ప్లాంట్ల ద్వారా మొత్తం 8 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో 66 మిలియన్ టన్నులకుపైగా సామర్థ్యంతో ఇండియాలోనూ లఫార్జ్‌హోల్సిమ్ గ్రూప్ నంబర్‌వన్‌గా అవతరించనుంది. ఇది మొత్తం దేశ సిమెంట్ సామర్థ్యం 368 మిలియన్ టన్నులలో 18%కు సమానం.

 కాంపిటీషన్ కమిషన్ కన్ను?
 ల ఫార్జ్, హోల్సిమ్ విలీనం వల్ల దేశీయంగా కీలక ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమను ఒకే గ్రూప్ నియంత్రించేందుకు అవకాశమేర్పడనుంది. గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే బాటలో విలీన సంస్థకు సంబంధించిన కొన్ని ప్లాంట్లను విక్రయించమంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. లఫార్జ్, హోల్సిమ్ విలీనం వల్ల దేశవ్యాప్తంగా కొన్ని కీలక ప్రాంతాలలో సిమెంట్ ధరలను నియంత్రించేందుకు కూడా వీలు చిక్కుతుందని పేర్కొన్నాయి. ఇదికాకుండా 200 మిలియన్ టన్నుల సామర్థ్యం ఆరు సిమెంట్ కంపెనీల చేతిలోనే ఉండనుంది. లఫార్జ్, హోల్సిమ్ బాటలో ఇప్పటికే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ ఉత్పాదక సామర్థ్యం సైతం దాదాపు 60 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకుంది. ఇందుకు ఇటీవల జేపీ సిమెంట్ గుజరాత్ ప్లాంట్‌ను సొంతం చేసుకోవడం కూడా కొంతమేర దోహదపడింది. దేశీయంగా సిమెంట్‌కు ప్రత్యేకత ఉన్నదని, ప్రాంతీయంగానూ కీలక పాత్రను పోషిస్తుందని, దీంతో సీసీఐ తప్పనిసరిగా డీల్‌పట్ల తగు పరిశీలన చేపడుతుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి.

 విలీన వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో అంబుజా సిమెంట్స్ 2.7% ఎగసి రూ. 209 వద్ద, ఏసీసీ 1% లాభంతో రూ. 1,375 వద్ద, అల్ట్రాటెక్ సిమెంట్ 3.2% జంప్‌చేసి రూ. 2,220 వద్ద ముగిశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement