Holcim
-
అదానీ కీలక నిర్ణయం: కరణ్ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు
న్యూఢిల్లీ: స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఆవిర్భవించింది. కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్ డాలర్లకు హోల్సిమ్ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ టేకోవర్ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు) గౌతమ్ అదానీ అధ్యక్షతన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్ ఇండియా మాజీ హెడ్ నితిన్ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్ బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ఇదీ చదవండి: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్ -
ఏసీసీ, అంబుజాకు ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే వారం సిమెంట్ రంగ దిగ్గజాల వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశముంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ లిస్టెడ్ కంపెనీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి మే నెలలోనే అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా రెండు సిమెంట్ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు రూ. 31,000 కోట్లు వెచ్చించే వీలుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 10.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫర్ ధరలు ఇలా.. ఓపెన్ ఆఫర్ నిర్వాహక సంస్థల తాజా సమాచారం ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్ వాటాదారులకు అదానీ గ్రూప్ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ నెల 26 నుంచి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 9న ముగియనున్న ఆఫర్లో భాగంగా ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300, అంబుజా సిమెంట్ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19,880 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇక ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకునేందుకు రూ. 11,260 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్ వాటాలు కలిగి ఉంది. రెండు సంస్థల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. దేశవ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీమిక్స్ యూనిట్లను కలిగి ఉన్నాయి. -
అంబుజా, ఏసీసీకి ఓపెన్ ఆఫర్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా రెండు లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఆఫర్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలలో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న నేపథ్యంలో సెబీ నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 385 ధర ప్రకటించగా.. ఏసీసీకి రూ. 2,300 ధరతో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ సిమెంట్ దిగ్గజాలలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో సుమారు రూ. 81,300 కోట్ల(10.5 బిలియన్ డాలర్లు) విలువైన(ఓపెన్ ఆఫర్‌తో కలిపి) ఒప్పందాన్ని అదానీ గ్రూప్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మారిషస్ సంస్థ ద్వారా మారిషస్ అనుబంధ(ఆఫ్‌షోర్) సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అదానీ గ్రూప్ అంబుజా, ఏసీసీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 51.63 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఇదే విధంగా ఏసీసీ వాటాదారుల నుంచి 26 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకోనుంది. ఇందుకు మరో రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. అంబుజా, ఏసీసీలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో నికరంగా అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం అంబుజా, ఏసీసీ వార్షికంగా 70 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్ షేరు 2.3% బలపడి రూ. 367.4 వద్ద నిలవగా.. ఏసీసీ 4% జంప్‌చేసి రూ. 2,193 వద్ద ముగిసింది. -
అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్‌లు ప్రకటించాయి. వెరసి సిమెంట్ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్ ప్లాంట్లు, కోల్ మైన్స్ నిర్వహించే అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీవైపు దృష్టిసారించింది. ఈ బాటలో సిమెంట్ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ దేశీయంగా సిమెంట్ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. కాగా.. సిమెంట్ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతోపాటు.. అల్ట్రాటెక్ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. డీల్ వివరాలివీ.. ► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్ ఇండియా అంబుజా సిమెంట్స్‌లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ► అంబుజా సిమెంట్‌కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్‌కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించనుంది. ► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. ► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల ప్రస్తుత సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షికంగా 119.95 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. దిగ్గజాల తీరిదీ ► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్) విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ► అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది. ► 2015లో ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్తో హోల్సిమ్ విలీనమైంది. లఫార్జ్హోల్సిమ్గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్‌లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది. క్వింటిలియన్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 49 శాతం వాటా కొనుగోలు డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్(క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్(క్యూఎంఎల్)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలుకి క్వింట్ డిజిటల్ మీడియా(క్యూడీఎంఎల్)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్ బల్ కంపెనీ క్యూబీఎంఎల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. క్యూబీఎంఎల్.. బ్లూమ్బెర్గ్క్వింట్ పేరుతో బిజినెస్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ కోసమే అదానీ గ్రూప్‌తో డీల్‌ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్ తెలిపింది. కాగా, డీల్ విలువ తెలియలేదు., మార్గదర్శనం దేశీయంగా మా బిజినెస్‌లను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్ నాయకత్వం వహించగలదు. – జాన్ జెనిష్, సీఈవో, హోల్సిమ్ లిమిటెడ్ వృద్ధిపై విశ్వాసం సిమెంట్ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్. -
లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్!
డీల్‌ను తిరస్కరించిన హోల్సిమ్ బోర్డు జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలైన హోల్సిమ్, లఫార్జ్‌ల మధ్య కుదిరిన మెగా విలీనానికి బ్రేకులు పడ్డాయి. 40 బిలియన్ డాలర్ల ఈ ప్రతిపాదిత డీల్‌ను ఇప్పుడున్న ప్రకారం ఒప్పుకోబోమని స్విట్జర్లాండ్ సంస్థ హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు తిరస్కరించింది. అంతేకాకుండా విలీనం తర్వాత పాలనాపరమైన అంశాలపైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇరు కంపెనీలకూ భారత్‌లో గణనీయమైన స్థాయిలోనే సిమెంట్ కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విలీన డీల్‌కు భారత్ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది కూడా. ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్, హోల్సిమ్‌లు తమ విలీన ప్రణాళికలను 2014 ఏప్రిల్‌లో ప్రకటించాయి. ఈ విలీనంతో 90 దేశాల్లో కార్యకలాపాలతో పాటు 40 బిలియన్ డాలర్ల అమ్మకాలు గల సంస్థ ఆవిర్భవించనుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ గ్రూప్‌గా కూడా అవతరించనుంది. పాలనా పరమైన అంశాలతో పాటు షేర్ల ఎక్స్ఛేంజ్ రేషియో విషయంలో కూడా మరింతగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంబినేషన్ ఒప్పందాన్ని ఇక పరిగణనలోకి తీసుకోబోమని సమావేశంలో నిర్ణయించినట్లు హోల్సిమ్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైలో ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు విలీనానికి సంబంధించి ఈ కాంబినేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాగా, ఈ విలీనాన్ని సాకారం చేసేందుకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని... ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ఏవైనా సవరణలకు ఆస్కారం ఉంటుందని లఫార్జ్ కూడా మరో ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకానీ ఇప్పుడున్న ఒప్పందాల్లో ఇతరత్రా ఎలాంటి మార్పులను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. -
సిమెంట్ రారాజుగా లఫార్జ్‌హోల్సిమ్
జ్యూరిక్/న్యూఢి ల్లీ: అంతర్జాతీయ దిగ్గజాలు హోల్సిమ్(స్విట్జర్లాండ్), లఫార్జ్(ఫ్రాన్స్) విలీన ప్రతిపాదన కారణంగా ప్రపంచ సిమెంట్ రారాజుగా విలీన సంస్థ లఫార్జ్‌హోల్సిమ్ ఆవిర్భవించనుంది. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఏకగ్రీవంగా సమ్మతించాయి. కీలక వాటాదారులు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెరసి లఫార్జ్‌హోల్సిమ్ 90 దేశాలలో కార్యకలాపాలు కలిగిన సిమెంట్ దిగ్గజంగా నిలవనుంది. విలీన సంస్థ టర్నోవర్ 32 బిలియన్ యూరోలు(44 బిలియన్ డాలర్లు)కాగా, ఏ ఒక్క దేశం నుంచీ ఆదాయంలో 10% మించి వాటా లేకపోవడం గమనార్హం. కొత్తగా ఏర్పడనున్న లఫార్జ్‌హోల్సిమ్ కేంద్ర స్థానం స్విట్జర్లాండ్‌లో కొనసాగనుండగా, హోల్సిమ్ చైర్మన్ ఉల్ఫ్‌గాంగ్ రీట్జిల్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక లఫార్జ్ సీఈవో బ్రూనో లఫాంట్ గ్రూప్ సీఈవో బాధ్యతలు చేపడతారు. సిమెంట్, కాంక్రీట్ విభాగాలలో కొత్త కంపెనీ నెంబర్‌వన్‌గా ఆవిర్భవిస్తుందని రెండు సంస్థలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఇండియాలోనూ నంబర్‌వన్ ప్రపంచ దిగ్గజాల విలీనం నేపథ్యంలో అనుబంధ సంస్థల ద్వారా దేశీయంగానూ లఫార్జ్, హోల్సిమ్ సిమెంట్ రంగంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. దేశీ దిగ్గజ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్లను సొంతం చేసుకోవడం ద్వారా హోల్సిమ్ ఇండియాలో భారీ స్థాయి కార్యకలాపాలను అందుకోగా, 1999లో టాటా స్టీల్‌కు గల సిమెంట్ ప్లాంట్ కొనుగోలు ద్వారా దేశీయ సిమెంట్ బిజినెస్‌లోకి లఫార్జ్ ప్రవేశించింది. హోల్సిమ్ సొంతం చేసుకున్న ఏసీసీ, అంబుజా సిమెంట్ సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం 58.5 మిలియన్ టన్నులుకాగా, దేశవ్యాప్తంగా పలుచోట్ల సిమెంట్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి. ఇక 2001లో రేమండ్ సిమెంట్ ప్లాంట్‌ను కూడా కొనుగోలు చేసిన లఫార్జ్ ప్రస్తుతం నాలుగు సిమెంట్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా తూర్పు, మధ్య భారత ప్రాంతాలలో కాన్సెర్టో, డ్యురాగార్డ్ బ్రాండ్ల ద్వారా అమ్మకాలను విస్తరించింది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లో గల నాలుగు ప్లాంట్ల ద్వారా మొత్తం 8 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో 66 మిలియన్ టన్నులకుపైగా సామర్థ్యంతో ఇండియాలోనూ లఫార్జ్‌హోల్సిమ్ గ్రూప్ నంబర్‌వన్‌గా అవతరించనుంది. ఇది మొత్తం దేశ సిమెంట్ సామర్థ్యం 368 మిలియన్ టన్నులలో 18%కు సమానం. కాంపిటీషన్ కమిషన్ కన్ను? ల ఫార్జ్, హోల్సిమ్ విలీనం వల్ల దేశీయంగా కీలక ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమను ఒకే గ్రూప్ నియంత్రించేందుకు అవకాశమేర్పడనుంది. గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే బాటలో విలీన సంస్థకు సంబంధించిన కొన్ని ప్లాంట్లను విక్రయించమంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. లఫార్జ్, హోల్సిమ్ విలీనం వల్ల దేశవ్యాప్తంగా కొన్ని కీలక ప్రాంతాలలో సిమెంట్ ధరలను నియంత్రించేందుకు కూడా వీలు చిక్కుతుందని పేర్కొన్నాయి. ఇదికాకుండా 200 మిలియన్ టన్నుల సామర్థ్యం ఆరు సిమెంట్ కంపెనీల చేతిలోనే ఉండనుంది. లఫార్జ్, హోల్సిమ్ బాటలో ఇప్పటికే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ ఉత్పాదక సామర్థ్యం సైతం దాదాపు 60 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకుంది. ఇందుకు ఇటీవల జేపీ సిమెంట్ గుజరాత్ ప్లాంట్‌ను సొంతం చేసుకోవడం కూడా కొంతమేర దోహదపడింది. దేశీయంగా సిమెంట్‌కు ప్రత్యేకత ఉన్నదని, ప్రాంతీయంగానూ కీలక పాత్రను పోషిస్తుందని, దీంతో సీసీఐ తప్పనిసరిగా డీల్పట్ల తగు పరిశీలన చేపడుతుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విలీన వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో అంబుజా సిమెంట్స్ 2.7% ఎగసి రూ. 209 వద్ద, ఏసీసీ 1% లాభంతో రూ. 1,375 వద్ద, అల్ట్రాటెక్ సిమెంట్ 3.2% జంప్‌చేసి రూ. 2,220 వద్ద ముగిశాయి. -
ప్రపంచ సిమెంట్ దిగ్గజాల విలీనం!
జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలు విలీనమయ్యేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు ఫ్రెంచ్ కంపెనీ లఫార్జ్తో స్విట్జర్లాండ్ దిగ్గజం హోల్సిమ్ చర్చలు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటికే చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు దిగ్గజాల బలాలు, బలహీనతలను లెక్కలోకి తీసుకుని విలీన ప్రతిపాదనను సిద్ధం చేయనున్నట్లు హోల్సిమ్ ప్రతినిధి మీడియాకు వెల్లడిం చారు. చర్చలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. 50 బిలియన్ డాలర్ల కంపెనీ ల ఫార్జ్, హోల్సిమ్ విలీనమైతే వీటి సంయుక్త విలువ 50 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3 లక్షల కోట్లు)కు చేరుతుంది. ప్రపంచ సిమెంట్ రారాజుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ వార్తల నేపథ్యంలో ప్యారిస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లఫార్జ్ షేరు 10% జంప్‌చేయగా, జ్యూరిక్ ఎక్స్ఛేంజీలో హోల్సిమ్ షేరు 8% పుంజుకుంది. లఫార్జ్, హోల్సిమ్ రెండూ భారత్‌లో కూడా సబ్సిడరీల ద్వారా కార్యకలాపాలను విస్తరించాయి. 1999లో టాటా స్టీల్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్ కొనుగోలు ద్వారా దేశీయ సిమెంట్ బిజినెస్‌లోకి లఫార్జ్ ప్రవేశించింది 2001లో రేమండ్ సిమెంట్ ప్లాంట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 4 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ప్రధానంగా తూర్పు, మధ్య భారత ప్రాంతాలలో కాన్సెర్టో, డ్యురాగార్డ్ బ్రాండ్లతో అమ్మకాలను విస్తరించింది. మొత్తం దేశీ తయారీ సామర్థ్యం 8 మిలియన్ టన్నులు. హోల్సిమ్ దూకుడు దేశీ దిగ్గజ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్లను 2005లో టేకోవర్ చేయడం ద్వారా హోల్సిమ్ భారత్‌లోకి దూసుకొచ్చింది. విడిగా ఏసీసీ సిమెంట్ తయారీ సామర్థ్యం 27.25 మిలియన్ టన్నులుకాగా, అంబుజా 25 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటికి దేశవ్యాప్తంగా పలుచోట్ల సిమెంట్ ప్లాంట్లు విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయంగా దిగ్గజాల సామర్థ ్యమిదీ... 2013లో హోల్సిమ్ అమ్మకాలు 22.11 బిలియన్ డాలర్లు(19.72 బిలియన్ స్విస్ ఫ్రాంకులు). ఇక లఫార్జ్ 20.81 బిలియన్ డాలర్లు(15.20 బిలియన్ యూరోలు) అమ్మకాలను సాధించింది. హోల్సిమ్ సిమెంట్ తయారీ సామర్థ్యం 217 మిలియన్ టన్నులు. లఫార్జ్ సిమెంట్ తయారీ సామర్థ్యం 137 మిలియన్ టన్నులు. 70 దేశాలలో కార్యకలాపాలు కలిగిన హోల్సిమ్లో 71,000 మంది పనిచేస్తున్నారు. 64 దేశాలలో విస్తరించిన లఫార్జ్ 65,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.