హోండా యాక్టివాలో కొత్త వేరియంట్
ఏడాదికి 50 లక్షల టూవీలర్లు విక్రయించడం లక్ష్యం
* హోండా సీఈఓ మురమత్సు
న్యూఢిల్లీ : హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ యాక్టివా స్కూటర్ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను బుధవారం ఆవిష్కరించింది. ధర రూ.48,852గా నిర్ణయించి నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. దీంతో పాటు మరో 5 కొత్త మోడళ్లను కంపెనీ ఆవిష్కరించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 కొత్త మోడళ్లను తెస్తామని, ఏడాదికి 50 లక్షల టూవీలర్లను విక్రయించడం లక్ష్యమని మురమత్సు తెలియజేశారు. తమ అంతర్జాతీయ మోటార్ బైక్‌ల విక్రయాల్లో భారత్ వాటా 25 శాతమని, ఈ ఆర్థిక సంవత్సరం జనవరిదాకా 36,92,374 టూవీలర్లను విక్రయించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ ఎస్. గులేరియా చెప్పారు.
రూ.1,000 కోట్లతో గుజరాత్‌లో తమ కంపెనీ నాలుగో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్లాంట్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో, డియో స్కూటర్ మోడళ్లలో కొత్త వేరియంట్‌లను, కొత్త సీబీ షైన్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెస్తామని వివరించారు.