110 సీసీలో హోండా కొత్త బైక్.. లివో
- ధర రూ. 52,989- రూ.55,489
- మైలేజీ 74 కి.మీ. అంటోన్న కంపెనీ
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 110 సీసీ కేటగిరిలో కొత్తగా లివో బైక్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. సీబీ ట్విస్టర్ స్థానంలో ఈ కొత్త బైక్‌ను కంపెనీ అందిస్తోందని సమాచారం. 2 వేరియంట్లలో, 4 రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతోంది. లివో సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.52,989, లివో సెల్ఫ్ డిస్క్ అలాయ్ ...ధర రూ.55,489 (రెండూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. 110 సీసీ కేటగిరిలో హోండా అందిస్తున్న నాలుగో మోడల్ ఇది. గతంలో డ్రీమ్ యుగ, డ్రీమ్ నువో, సీబీ ట్విస్టర్ మోడళ్లను అందించింది. తాము తేనున్న కొత్త, వినూత్నమైన మోడళ్లకు ఈ లివో బైక్ నాంది అని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు.
బైక్ ప్రత్యేకతలు...: సీబీ ట్విస్టర్‌తో సహా పలు హోండా బైక్‌ల స్ఫూర్తితో ఈ కొత్త హోండా లివోను డిజైన్ చేసినట్లుగా కనబడుతోంది. అవడానికి ఎంట్రీ లెవల్ బైక్ అయినా చూడ్డానికి స్పోర్ట్స్ బైక్ అనిపించేలా ఈ బైక్‌ను రూపొందించారు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 4గేర్లు, మైలేజీని పెంచే హోండా ఈకో టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్‌లో ఓడోమీటర్,స్పీడో మీటర్, ఫ్యూయల్ గేజ్‌తో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యుయల్ షాక్ రియర్ అబ్జార్బర్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. గరిష్ట వేగం గంటకు 86 కిమీ. ప్రయాణించే ఈ బైక్ 74 కిమీ. మైలేజీనిస్తుందని కంపెనీ అంటోంది.