బడ్జెట్ భరోసానిచ్చేనా? | Housing construction Sector | Sakshi
Sakshi News home page

బడ్జెట్ భరోసానిచ్చేనా?

Published Sat, Feb 28 2015 3:20 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

బడ్జెట్ భరోసానిచ్చేనా? - Sakshi

బడ్జెట్ భరోసానిచ్చేనా?

సాక్షి, హైదరాబాద్: సొంతింటి కొనుగోలుదారుల్ని ఊరిస్తూ కేంద్ర బడ్జెట్ మరోసారి మన ముందుకొస్తుంది. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నోసార్లు త మ బాధల్ని నివేదించినా.. గత ప్రభుత్వాలు కనికరించలేదు. కనీసం నేడైనా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిజమైన అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు.


ఈ బడ్జెట్‌లోనైనా గృహ నిర్మాణ రంగానికి మౌలిక వసతుల రంగ హోదా కల్పించాలి. దీనివల్ల రాయితీలొస్తాయి. పెట్టుబడుల్ని సులువుగా ఆకర్షించవచ్చు. దేశ, విదేశీ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తాయి. నిర్మాణ సంస్థల పని తీరూ మెరుగవుతుంది. ఫలితంగా ఆర్థికవృద్ధి సాధ్యమయ్యే ఆస్కారముంది. అంతిమంగా కొనుగోలుదారులకు ఆధునిక సదుపాయాలతో పాటు నాణ్యమైన గృహాలు అందుతాయి.
ప్రాజెక్ట్ అనుమతుల్లో జాప్యం వల్ల కొనుగోలుదారులపై 40 శాతం వరకూ అదనపు భారం పడుతోంది. అందుకే చాలా రోజులుగా కోరుకుంటున్న ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రామాణిక తనిఖీ జాబితా ద్వారా కేంద్ర, రాష్ట్ర అనుమతులు ఒకే చోట లభించే విధంగా చూడాలి. చట్టం పరిధిలోనే మున్సిపల్ పరిపాలన, రాజకీయ నియంత్రణ వ్యవస్థలో మార్పులు చేయాలి.
ఫ్లాట్ ఒకటే అయినా రకరకాల పన్నులతో డెవలపర్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం స్థిరాస్తి రంగాన్ని ద్వంద్వ పన్ను సమస్య తీవ్రంగా ఎదుర్కొంటోంది. సేవాపన్ను, వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీలతో బాటుస్థానిక సం స్థలకు రకరకాల రుసుములు చెల్లిం చాలి. ఈసారి బడ్జెట్ పన్నుల నుంచి ఉపశమనం పొందాలని ఆశిస్తున్నారు.
ఐదేళ్ల అనుభవం ఉన్న బిల్డర్లకు ఈసీబీ (ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్)లను అనుమతించాలి. నిర్మాణాల్లో వేగం పెరగాలంటే భారీ యంత్రాలను వినియోగించాలి. మరి వీటిని కొనుగోలు చేయడానికి బ్యాంకులు విరివిగా రుణాల్ని మంజూరు చేయాలి.
ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న 10.15 నుంచి 10.40 శాతం వడ్డీ వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వడ్డీ రేట్లను తగ్గించి గృహ రుణాలు తీసుకున్నవారు చెల్లించే నెలసరి వాయిదాలు తగ్గించేలా చేస్తారని అంచనాలు వేస్తున్నారు. గృహరుణాలు తీసుకున్నవారు చెల్లించే వడ్డీపై ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్నాయి.
రహదారులకు సంబంధించి ప్రత్యేక రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలి. దీంతో రోడ్డు పన్ను ద్వారా సమకూరే సొమ్మును సక్రమంగా వినియోగించే వీలుంటుంది. దీని ప్రభావం నివాస సముదాయాల మార్కెట్‌పైన తప్పక పడుతుంది. గ్రామీణ, పట్టణాలను అనుసంధానం చేయటం వల్ల విస్తృత స్థాయిలో స్థిరాస్తి రంగం వృద్ధి చెందుతుంది.
వినియోగదార్లు ఇళ్లు కొనేలా ప్రోత్సహించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా వడ్డీ రేట్లను తగ్గించాలి. ఆ దేశాల్లో 5 శాతం ఉండగా.. ఇక్కడ 10 శాతం పైనే ఉన్నాయి. భూముల కోనుగోలు, అభివృద్ధికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా డెవలపర్లకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు అన్ని పన్నులకూ ఒకే చలానా అందించే విధానం తీసుకొచ్చి పన్ను మదింపును సులువు చేయాలి.
 
రైల్వే బడ్జెట్‌తోనే భారం..

రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌తో సామాన్యుల సొంతింటి కల మరింత దూరమైంది. అదేంటి రైల్వే బడ్జెట్‌కు, సొంతింటికి సంబంధం ఏంటనుకుంటున్నారా? రైల్వే బడ్జెట్‌లో ఈసారి ప్రయాణికుల చార్జీలు పెంచలేదు కానీ, 12 రకాల సరుకులపై రవాణా చార్జీలు మాత్రం పెంచేశారు. ఇందులో సిమెంట్, బొగ్గు, ఉక్కు, ధాన్యం, వేరుశనగ నూనె, ఎల్‌పీజీ, కిరోసిన్ వంటివి ఉన్నాయి. వీటిపై 0.8-10 శాతం వరకూ రైలు రవాణా చార్జీలు పెరిగాయి.
సిమెంట్‌పై 2.7 శాతం, బొగ్గుపై 6.3 శాతం రవాణా చార్జీ అధికమవుతోంది. ఈ చార్జీల పెంపు సిమెంట్, ఉక్కు పరిశ్రమపై పడనుంది. దీంతో ఆయా పరిశ్రమలు నిర్మాణ సామగ్రి ధరలు పెంచే అవకాశమూ ఉంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని చెప్పే నిర్మాణ సంస్థలు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయన్న సాకుతో ఈ భారాన్ని కూడా కొనుగోలుదారులపైనే వేయనున్నాయి. అం టే మొత్తంగా చూస్తే రైల్వే బడ్జెట్‌తో సామాన్యుల సొంతింటి కల మరింత భారంగా మారిందన్నమాట.
 
చ.అ. ధరలు పెరుగుతాయ్..

కొంతకాలం క్రితం రూ.275-280 ఉన్న సిమెంట్ బస్తా ధరను రూ.350-370 వరకూ పెంచేశారు. ఇప్పుడు రైలు రవాణా చార్జీలు పెరిగిన కారణంతో ఆ మేరకు సిమెంట్, స్టీలు ధరలు కూడా పెరుగుతాయి. వీటి భారాన్ని మోయలేక నిర్మాణ సంస్థలు చ.అ. ధరలను పెంచే అవకాశముందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్   వెంకట్‌రెడ్డి చెప్పారు. భవన నిర్మాణాల్లో సిమెంట్, ఉక్కు వాటా 40 శాతంగా ఉంటుంది. అంటే చ.అ. నిర్మాణానికి రూ.1,350 అనుకుంటే ఇందులో సిమెంట్, ఉక్కు వాటా రూ.550 పైనే ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం 1,000 చ.అ. 2 బీహెచ్‌కే ఫ్లాట్ ధర రూ.32 లక్షలుగా ఉంటే.. ఇకపై దీని ధర రూ.33 లక్షలకు పెరిగే అవకాశముంది. (ట్యాక్స్, వ్యాట్, ఇతరత్రా చార్జీలు కలుపుకుంటే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement