కంప్యూటర్ కొనుగోలుకు వడ్డీ లేని రుణం..
♦ రూ.11,998 వరకు ప్రయోజనాలు
♦ విద్యార్థుల కోసం హెచ్‌పీ పథకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ ఇండియా విద్యార్థుల కోసం ‘బ్యాక్ టు కాలేజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ను ఎటువంటి వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో కొనుక్కోవచ్చు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేదు. 6, 9, 12 నెలల వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించొచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలనూ అందుకోవచ్చు. ప్రయోజనాల కింద మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్‌సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చు.
కంప్యూటర్ కొనుక్కోవాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటువంటి వారికి రుణ సౌకర్యం పెద్ద ఊరటనిస్తుందని హెచ్‌పీ ఇండియా కంజ్యూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. కమ్యూనికేషన్స్ ప్రతినిధి దినేష్ జోషితో కలసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. లక్ష మందికిపైగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 500ల పైచిలుకు హెచ్‌పీ విక్రయశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. హెచ్‌పీ పీసీల ధర రూ.23 వేల నుంచి ప్రార ంభమవుతుంది.