బీజింగ్ : టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా తన హవా చాటుతున్న ఆపిల్, చైనా మార్కెట్‌లో మాత్రం తన సత్తాను నిరూపించుకోలేకపోతుంది. చైనా వినియోగదారులకు దగ్గర అవాలనుకుంటున్న ఆపిల్‌ను స్థానిక బ్రాండ్‌లు దెబ్బకొడుతున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో చైనా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల తొలి ఛాయిస్‌గా హువాయ్ నిలుస్తున్నట్టు వెల్లడైంది. ఫైనాన్సియల్ టైమ్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 31.4 శాతం మంది హువాయ్‌ను తమ బ్రాండుగా ఎంపికచేసుకుంటున్నట్టు తెలిపారు. తమ తదుపరి ఫోన్‌గా ఐఫోన్‌ను కొనుగోలు చేస్తామనే వారి సంఖ్య 24.2 శాతానికి పడిపోయింది. 2016లో ఐఫోన్ 7 లాంచ్ అయినప్పుడు ఈ శాతం 25.8 శాతంగా ఉంది. యేటియేటికి ఐఫోన్ కొనుగోలు చేద్దామనుకునే వారి సంఖ్య పడిపోతుందని తేలింది.
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనూ జూన్, జూలై విక్రయాల్లో హువాయ్ తొలిసారి ఆపిల్‌ను అధిగమించేసింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా రిపోర్టు 'మార్కెట్ పల్స్ ఫర్ జూలై 2017'' ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తర్వాతి స్థానం గ్లోబల్‌గా హువాయ్‌దేనని తెలిసింది. హువాయ్‌కు ఇది ఒక మైలురాయని, విక్రయ ఛానల్‌ను విస్తరించుకోవడం, తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లలో స్థిరమైన పెట్టుబడులకు ఇది ఒక ప్రతీకని రిపోర్టులు పేర్కొన్నాయి. కీలక సప్లై చైన్ పార్టనర్లతో హువాయ్, వివో, ఒప్పో, షావోమిలు విజయమవుతున్నట్టు తెలిపాయి. బెజెల్-ఫ్రీ, ఫుల్ డిస్‌ప్లేస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇన్-హౌజ్ చిప్‌సెట్స్, అడ్వాన్స్‌డ్ కెమెరా ఫీచర్లతో వీటి ఫోన్లు రూపొందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది లాంచ్ అయిన కొత్త ఐఫోన్లు కొనుగోలుచేస్తామనే వారి శాతం కూడా తగ్గిపోయింది.