హ్యుందాయ్ క్రెటా వచ్చేసింది..
రేటు రూ. 8.59 లక్షల నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ : దేశీయంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) మార్కెట్లో ఆధిపత్యాన్ని దక్కించుకునే లక్ష్యంతో ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా మంగళవారం ‘క్రెటా’ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 8.59 లక్షల నుంచి రూ. 13.6 లక్షల దాకా ఉంటాయి. భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు క్రెటా ఉపయోగపడగలదని, దీన్ని అంతర్జాతీయంగా ఇతర మార్కెట్లలోనూ ఆవిష్కరిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ బీఎస్ సియో తెలిపారు. గడచిన 20 రోజుల్లో 15,000 పైచిలుకు ప్రీ-బుకింగ్స్ వచ్చినట్లు ఆయన వివరించారు. కొరియాలో డిజైన్ చేసిన క్రెటాను అభివృద్ధి చేయడంపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్.. చెన్నైలోని తమ ఇంజినీర్లు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నట్లు సియో తెలిపారు.
ఫైవ్ సీటర్ క్రెటాలో అత్యాధునిక నేవిగేషన్ సిస్టం, పుష్ బటన్ స్టార్ట్, లెదర్ సీట్లు మొదలైన ఫీచర్లు ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 8.59-11.19 లక్షలుగాను, డీజిల్ వెర్షన్స్ రేట్లు రూ. 9.46-13.6 లక్షలు దాకా ఉంటాయి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా సఫారీ స్టార్మ్ మొదలైన వాటితో క్రెటా పోటీపడనుంది. వీటి ధర రూ. 6.75-15.99 లక్షల దాకా ఉంది.