ఐబీ హౌసింగ్‌ దూకుడు- ఎఫ్‌పీఐల పుష్‌ | IB Housing finance jumps- Unichem lab weaken | Sakshi
Sakshi News home page

ఐబీ హౌసింగ్‌ దూకుడు- ఎఫ్‌పీఐల పుష్‌

Published Sat, Jun 20 2020 10:36 AM | Last Updated on Sat, Jun 20 2020 1:24 PM

IB Housing finance jumps- Unichem lab weaken - Sakshi

వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 524 పాయింట్లు పెరిగి 34,792 వద్ద నిలవగా.. 153 పాయిం‍ట్లు జంప్‌చేసిన నిఫ్టీ 10,244 వద్ద స్థిరపడింది. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడైన వార్తల నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్‌ లాభాలతో దూసుకెళ్లగా.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో యూనికెమ్‌ లేబొరేటరీస్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం..

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌
ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా శుక్రవారం ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ఎఫ్‌పీఐలు 2.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. ఐబీ హౌసింగ్‌లో మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా(సింగపూర్‌) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్‌రాక్‌ అడ్వయిజర్స్‌కు చెందిన ఐషేర్స్‌ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్‌ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్‌లో ఐషేర్స్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ డివిడెండ్‌ ఈటీఎఫ్‌ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ డివిడెండ్‌ ఈటీఎఫ్‌ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి. అయితే ఇంటిగ్రేటెడ్‌ కోర్‌ స్ట్రాటజీస్‌(ఏషియా) రూ. 202 ధరలో 21.69 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో వారాంతాన ఐబీ హౌసింగ్‌ కౌంటర్లో భారీ ట్రేడింగ్‌ నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో రూ. 209ను సైతం అధిగమించింది.

యూనికెమ్‌ క్యూ4 వీక్‌
హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ యూనికెమ్‌ ల్యాబొరేటరీస్‌ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4లో కంపెనీ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 38 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 15 శాతం క్షీణించి రూ. 320 కోట్లకు పరిమితమయ్యాయి. వారాంతాన సమావేశమైన బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో యూనికెమ్‌ ల్యాబ్‌ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో రూ. 150 వరకూ దిగజారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement