
ముంబై: వేతనాల పెంపు ప్రతిపాదనలపై బ్యాంకు ఉద్యోగులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా 13వ రౌండు చర్చల్లో ఐబీఏ ఆరు శాతం పెంపును ప్రతిపాదించింది. కానీ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల సమాఖ్య యూఎఫ్‌బీయూ దీన్ని తిరస్కరించింది. చర్చలు కొనసాగించడానికి సిద్ధమని మాత్రం ప్రకటించింది. ‘ఐబీఏ గతంలో ప్రతిపాదించిన 2% ఆఫర్‌ను సవరించి 6%కి పెంచింది. అయితే యూఎఫ్‌బీయూ దీన్ని తిరస్కరించింది.
కానీ చర్చల కొనసాగింపునకు అంగీకరించింది’ అని యూఎఫ్‌బీయూ కన్వీనర్ (మహారాష్ట్ర) దేవీదాస్ తుల్జాపూర్కర్ తెలిపారు. బ్యాంకు యూనియన్లు 25 శాతం పెంపును డిమాండ్ చేస్తున్నాయని, ఆగస్టు నెలాఖరులోగా దీనిపై మళ్లీ చర్చించేందుకు ఐబీఏ అంగీకరించిందని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 37 బ్యాంకుల యాజమాన్యాల తరఫున ఉద్యోగుల వేతన సవరణపై ఐబీఏ చర్చలు జరుపుతోంది. మే 5న జరిగిన చర్చల్లో ఐబీఏ కేవలం రెండు శాతమే ఆఫర్ చేసింది. దీన్ని తిరస్కరించిన ఉద్యోగుల యూనియన్లు మే నెలలో 2 రోజుల సమ్మెకు కూడా దిగాయి.