సాక్షి,ముంబై: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాగా ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో (జూన్,30) ముగియనుంది. ఛైర్మన్‌గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు ఈ నియమకాన్ని చేపట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎండీ మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు సమ్మతించింది.1977 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment