ఐసీఐసీఐ లాభం రయ్.. | ICICI Bank slashes its equity in 2 overseas arms to 5.2% | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లాభం రయ్..

Published Sat, Oct 31 2015 12:36 AM | Last Updated on Thu, Oct 4 2018 8:05 PM

ఐసీఐసీఐ లాభం రయ్.. - Sakshi

ఐసీఐసీఐ లాభం రయ్..

క్యూ2లో రూ. 3,419 కోట్లు; 12 శాతం అప్
* ఆదాయం 13.5 శాతం వృద్ధి; రూ.25,137 కోట్లు
* రిటైల్ రుణాలు, విదేశీ మార్జిన్ల ఆసరా..
* మరింత పెరిగిన మొండిబకాయిలు...
* ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా విక్రయానికి ఓకే
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్.. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) రూ.3,419 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,065 కోట్లతో పోలిస్తే 12% వృద్ధి నమోదైంది. ప్రధానంగా రిటైల్ రుణాలు పుంజుకోవడం, విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మార్జిన్లు మెరుగుపడటం లాభాల జోరుకు దోహదం చేసింది. అయితే, మొండిబకాయిలు మాత్రం మరింత పెరగడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 13.5 శాతం వృద్ధితో రూ.22,150 కోట్ల నుంచి రూ.25,138 కోట్లకు దూసుకెళ్లింది.
 
స్టాండెలోన్‌గానూ జోష్...
బ్యాంకింగ్ బిజినెస్(సాండెలోన్) ప్రాతిపదికన కూడా ఐసీఐసీఐ ఆకర్షణీయమైన పనితీరును నమోదుచేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో నికర లాభం 12% ఎగసి రూ.3,030 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,709 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.14,889 కోట్ల నుంచి రూ.16,106 కోట్లకు పెరిగింది. 8.2% వృద్ధి నమోదైంది.

నికర వడ్డీ ఆదాయం 13% వృద్ధితో రూ.4,657 కోట్ల నుంచి రూ.5,251 కోట్లకు ఎగసింది. వడ్డీయేతర ఆదాయం కూడా 10% ఎగసి రూ.3,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఈ మొత్తం రూ.2,738 కోట్లు. విదేశీ కార్యకలాపాలపై మార్జిన్లు 1.58 శాతం నుంచి 2 శాతానికి పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) క్యూ2లో 0.1 శాతం పెరిగి 3.52 శాతానికి చేరాయి.
 
మొండిబకాయిల సెగ...
బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) క్యూ2లో 3.77 శాతానికి(రూ.15,858 కోట్లు) ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.12 శాతంగా(రూ.11.547 కోట్లు), ఈ ఏడాది క్యూ1లో 3.68 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 1.09 శాతం(రూ.3,942 కోట్లు) నుంచి 1.65 శాతానికి(రూ.6,759 కోట్లు) పేరుకుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో నికర ఎన్‌పీఏలు 1.58 శాతంగా నమోదయ్యాయి.

జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో మొండిబకాయిలకు ప్రొవిజన్స్ రూపంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.942 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.850 కోట్లు. ఇక క్యూ2లో కొత్తగా రూ.2,242 కోట్లు మొండిబకాయిలుగా మారాయి. పునర్వవస్థీకరణ రుణాల్లో రూ.931 కోట్ల ఎన్‌పీఏలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 17 శాతంగా నమోదైంది. మొత్తం రుణాల్లో రిటైల్ విభాగ రుణాలు 40 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.
ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర బీఎస్‌ఈలో శుక్రవారం 2 శాతం లాభపడి రూ.277 వద్ద ముగిసింది.
 
ఈ ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్లను ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించగలమన్న నమ్మకం ఉంది. ఆర్‌బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా ఖాతాదారులకు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదలాయిస్తున్నాం. డిమాండ్ మందగమనం కారణంగానే కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 7%కే పరిమితమైంది. పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 18-20 శాతం స్థాయిలో ఉండొచ్చు.
 - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ
 
ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా
సాధారణ బీమా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.1,550 కోట్లు. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఫెయిర్‌ఫాక్స్ వాటా 35 శాతానికి చేరనుంది. ప్రవాస భారతీయుడైన ప్రేమ్ వత్స నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు జాయింట్ వెంచర్‌గా దీన్ని ఏర్పాటు చేశాయి.

దేశీ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో తాజా ఒప్పందం చోటుచేసుకుంది. ఈ డీల్ ప్రకారం ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీ విలువ రూ.17,225 కోట్లుగా లెక్కతేలినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ అనుబంధ సంస్థ ఐపీఓకు సంబంధించి తక్షణ ప్రణాళికలేవీ లేవని ఐసీఐసీఐ చీఫ్ చందాకొచర్ స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement