
ముంబై : రిలయన్స్ జియో ఇచ్చిన షాక్‌తో టెలికాం కంపెనీలు ఒక్కోటి 4జీ స్మార్ట్‌ఫోన్ల దిశగా యోచన ప్రారంభించాయి. జియో ఫీచర్‌ఫోన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టగా.. తాజాగా ఐడియా, వొడాఫోన్ కంపెనీలు కూడా తమ 4జీ ఫోన్లతో ఈ పండుగ సీజన్‌లో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. రూ.1,500 లేదా అంతకంటే తక్కువ ధరకు 4జీ ఫోన్లను ఆఫర్ చేయాలని ఐడియా, వొడాఫోన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వొడాఫోన్, ఐడియాలు రెండూ కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి దేశీయ హ్యాండ్ సెట్ తయారీదారులు లావా, కార్బన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇవి సునిల్ మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్, అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు కౌంటర్‌గా వీటిని ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొన్నాయి.
ఎయిర్‌టెల్ ఈ బుధవారమే రూ.1,399కు ఎంట్రీ-లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌చేసింది. కార్బన్‌తో కలిసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ప్రస్తుతం అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించబోతున్న ఐడియా, వొడాఫోన్‌లు కూడా 4జీ స్మార్ట్‌ఫోన్ల విడుదలపై దృష్టిసారించాయి. మెగా విలీనంతో ఈ కంపెనీల యూజర్ల సంఖ్య 500 మిలియన్‌కు చేరబోతుంది. దీంతో అత్యధిక మొత్తంలో మొబైల్ యూజర్లు కలిగిన సంస్థగా ఇవి అవతరించబోతున్నాయి. మొబైల్ ఆపరేటర్లతో చర్చలు జరిపినట్టు లావా, కార్బన్‌లు కూడా ధృవీకరించాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. దివాలి కంటే ముందుగానే ఈ డీల్స్ చివరి దశకు వస్తాయని తెలిపాయి. మూడు టెల్కో కంపెనీలతో తాము చర్చలు జరిపామని, కానీ ఇంకా ప్లాన్లు చివరి దశకు చేరుకోలేదని లావా ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ చెప్పారు. అయితే ఏ టెల్కోలతో ఆయన చర్చలు జరిపారో వెల్లడించలేదు. వొడాఫోన్, ఐడియాలు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.