వొడాఫోన్ ఇండియా - ఐడియా సెల్యులార్ కంపెనీలు
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించేందుకు.. వొడాఫోన్, ఐడియాలు విలీనం కాబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రితమే ఇరు కంపెనీలు విలీనంపై తుది ప్రకటన ఇచ్చేశాయి. అప్పటి నుంచి ఈ కంపెనీలు విలీన ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాలేకపోయింది. వొడాఫోన్ ఇండియా-ఐడియా సెల్యులార్ విలీనం ఆలస్యమైతే, వీటి మెగా కంపెనీ భారీగా కస్టమర్లను, రెవెన్యూలను నష్టపోయే ప్రమాదముందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విలీన ప్రక్రియ ముగియడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశముందని, ఈ సమయంలో రెవెన్యూ మార్కెట్ షేరులో ఈ సంస్థ 150 బేసిస్ పాయింట్లను కోల్పోయే ప్రమాదముందని తెలుస్తోంది. దీంతో ప్రతి రెండు నెలల జాప్యానికి 600 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు రెవెన్యూలను ఈ విలీన సంస్థ కోల్పోతుందని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని చెప్పారు.
కీలక కస్టమర్లను, రెవెన్యూ మార్కెట్ షేరును భారతీ ఎయిర్‌టెల్‌కు, రిలయన్స్ జియోకు వదులుకోవాల్సి వస్తుందని కులకర్ని తెలిపారు. మార్కెట్ వ్యూహాల విధంగా వెళ్లి, విలీనాన్ని త్వరగా ముగించేయాలని చెప్పారు. గత నెల చివరి వరకే వొడాఫోన్, కుమార్ బిర్లాకు చెందిన ఐడియాల విలీన ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. కానీ మూడో పార్టీ ఆసక్తి మేరకు ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. మెగా విలీనాన్ని వొడాఫోన్, ఐడియాలు రెండూ విజయవంతంగా ముగిస్తాయని, కొంత సమస్యం ఆలస్యమైతే అంత ప్రమాదకరమేమీ కాదని కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ అన్నారు. విలీన సంస్థలో ఇరు కంపెనీలకు సమానమైన యాజమాన్య హక్కులు ఉంటాయి. విలీన సంస్థ పేరును వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా ప్రతిపాదించారు. విలీన సంస్థలో వొడాఫోన్ గ్రూప్ 45.1 శాతం, ఐడియా ప్రమోటర్లు 26 శాతం వాటా కలిగి ఉండనున్నారు. మిగతా 28.9 శాతం వాటా పబ్లిక్ షేర్ హోల్డర్ల వద్ద ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment