న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) పూర్తిగా విక్రయించేయడం కూడా ఒక పరిష్కార మార్గమని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా ప్రతిపాదనలన్నీ పరిశీలించిన మీదట విక్రయం ఒక్కటే సరైన పరిష్కారమయ్యేట్లు కనిపిస్తోందని చెప్పారాయన. ‘వాటాదారులు, రుణ సంస్థల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కి సంబంధించినంత వరకూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి సమర్పించిన నివేదికలో సంస్థ విక్రయ అంశం కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని విక్రయించడమే సరైన మార్గం కావచ్చు’ అని శ్రీనివాస్ చెప్పారు. విభాగాల వారీగా విడగొట్టి విక్రయించడం లేదా అన్ని విభాగాలను కలిపి అమ్మేయడం లాంటి ప్రతిపాదనలున్నట్లు తెలియజేశారు. ఈ ప్రతిపాదనలన్నింటితో సరైన పరిష్కారం లభించగలదన్నారు.
రూ.91,000 కోట్ల రుణభారం..
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని దాదాపు 358 అనుబంధ సంస్థలు దాదాపు రూ.91,000 కోట్ల మేర రుణాలు బాకీ పడిన సంగతి తెలిసిందే. ఇందులో సింహభాగం రూ.57,000 కోట్లు బ్యాంకు రుణాలే కాగా, అందులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే అధికంగా ఉన్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఆగస్టు 27 నుంచి పలు రుణాలు డిఫాల్ట్ అవుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో, మార్కెట్లలో పెను దుమారం రేపిన ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఇటీవలే సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీకి సమర్పించింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి నాలుగో వంతు వాటాలుండగా, జపాన్‌కి చెందిన ఒరిక్స్ కార్పొరేషన్‌కి 23.5 శాతం వాటాలున్నాయి. మిగతా వాటాదారుల్లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (12.5 శాతం), ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ట్రస్ట్ (12 శాతం), హెచ్‌డీఎఫ్‌సీకి (9.02 %), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.67 %), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.42%) మొదలైనవి ఉన్నాయి.
ఎన్‌బీఎఫ్‌సీలకు సంక్షోభం లేదు..
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ద్రవ్య లభ్యత సమస్యలు మాత్రమే ఎదుర్కొంటున్నాయని, సంక్షోభమేమీ లేదని శ్రీనివాస్ చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీలు తమ తమ వ్యాపార విధానాలను పునఃసమీక్షించుకుని, నిలకడగా రాణించే విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఉదంతంతో వ్యవస్థలో నిధుల కొరత చర్చనీయమైన సంగతి తెలిసిందే. ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలోనూ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలే ఎక్కువగా లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్నాయని శ్రీనివాస్ చెప్పారు.
‘ఇది ముఖ్యంగా ఒక విభాగంలో ఏర్పడిన సమస్య. ఇందులో పెద్ద పెద్ద సంస్థలున్నప్పటికీ నేను ప్రత్యేకంగా ఏ సంస్థ పేరూ ప్రస్తావించను. పరిస్థితి క్రమంగా సర్దుకుంటుంది. కానీ ఆ రంగంలోని సంస్థలు తమ వ్యాపార విధానాలను కూలంకషంగా పునఃసమీక్షించుకుని, నిధుల లభ్యత.. వినియోగం తదితర అంశాల మధ్య భారీ వ్యత్యాసాల్లేకుండా నిలకడైన వ్యాపార విధానాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ అంశంపై స్పందిస్తూ... 300 పైచిలుకు కంపెనీలలో అనేక సమస్యలను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు చేస్తోందని శ్రీనివాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment