వచ్చే పదేళ్లూ టాప్ స్పీడ్..
► భారత్ ఆర్థిక వ్యవస్థపై హార్వర్డ్ వర్సిటీ విశ్లేషణ
► వార్షిక వృద్ధి రేటు 7%గా అంచనా
న్యూయార్క్: భారత్ వచ్చే పదేళ్లూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. వార్షిక వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంటుందన్నది వీరి అంచనా. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (సీఐడీ)లో వీరు సమర్పించిన ఆర్థిక పరిశోధనా నివేదిక ప్రకారం...
- చైనా వృద్ధి తగ్గుతోంది. భారత్ మాత్రం దాన్ని పక్కకునెట్టి, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కొనసాగించనుంది.
- 2024 నాటికి చైనా వార్షిక వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- దక్షిణ ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలు వేగవంతమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. అయితే చమురు, ఇతర కమోడిటీ ఆధారిత దేశాలు మాత్రం వృద్ధి మందగమనం సమస్యలను ఎదుర్కొంటాయి.
- భారత్‌కు విభిన్న రంగాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే సామర్థ్యం పెరగనుంది. ఫార్మా, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు వీటిలో కీలకం. చైనా ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాన్ని పొందింది. కేవలం పదేళ్లలోనే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగింది.
-
2024 నాటికి అమెరికా సగటు వార్షిక వృద్ధి రేటు 2.8%గా ఉంటుంది. బ్రిటన్ విషయంలో ఇది 3.2%. స్పెయిన్ 3.4%, ఇటలీ 1.8%, జర్మనీ 0.35% వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది.