మొబైల్ బ్యాంకింగ్లో ఎస్బీఐ టాప్
ముంబై: మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల మార్కెట్‌లో 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. గతేడాది డిసెంబర్‌కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం పరిమాణంపరంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 38.44 శాతం, విలువ పరంగా సుమారు 36 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొంది. డిసెంబర్‌లో రూ. 17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఎస్‌బీఐ వివరించింది. ఎస్‌బీఐతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో పోటీ సంస్థలైన ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ లావాదేవీలు పరిమాణంపరంగా 70 లక్షలకు, యాక్సిస్ బ్యాంక్ 60 లక్షలకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీలు 39 లక్షలకు పరిమితమయ్యాయి. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి 2015 ఏప్రిల్ నుంచీ తాము అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు.