న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగించే కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల దిగుమతుల వ్యయాలు దాదాపు పది శాతం మేర పెరిగిపోతాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. అయితే, దేశ ప్రయోజనాలు కాపాడేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోఏఐ తెలియజేసింది.
సాధారణంగా ఆపరేటర్లు ఏటా దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువ చేసే నెట్‌వర్క్ పరికరాలను దిగుమతి చేసుకుంటారని, గత రెండు త్రైమాసికాల్లో దాదాపు 2–3 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు జరిగి ఉంటాయని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. కొత్తగా సుంకాల పెంపుతో దిగుమతుల వ్యయాలు 10 శాతం మేర పెరగవచ్చని చెప్పారు. బేస్ స్టేషన్స్ సహా కొన్ని కమ్యూనికేషన్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 20 శాతం దాకా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మాథ్యూస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment