భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
కెనడా వ్యాపార దిగ్గజాలతో ప్రధాని మోదీ
టొరంటో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కెనడా ఇన్వెస్టర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కెనడా వ్యాపార దిగ్గజాలతో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన సూచించారు.
విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయాలను మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్‌లో వెల్లడించారు. కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌తో కలిసి వ్యాపారవేత్తలతో సమావేశమైన మోదీ.. ఆ తర్వాత పెన్షన్ ఫండ్ ఆఫ్ కెనడా అధికారులతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యల గురించి చర్చించారు.
కెనడా పెన్షన్ ఫండ్లు సురక్షితమైన పెట్టుబడి సాధనాల కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2013-14లో 5.18 బిలియన్ డాలర్లు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇది 4.83 బిలియన్ డాలర్లు.