విశ్వనగరానికి ఓ విజన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం గ్లోబల్ సిటీగా మారాలంటే సరికొత్త విజన్ అవసరం అంటున్నారు వివిధ రంగాలకు చెందిన నిపుణులు. ట్రాఫిక్ కష్టాలు.. గుంతలమయమైన రహదారులు.. శ్వాసకోశ వ్యవస్థలను దెబ్బతీస్తోన్న వాయు కాలుష్యాన్ని సమూలంగా పారదోలాలని, చారిత్రక మూసీనది.. హుస్సేన్‌సాగర్.. దుర్గం చెరువు సహా వివిధ జలాశయాలను పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామంటున్న పాలకులు ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ అంశాలు, నగర చరిత్ర, వారసత్వ కట్టడాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కంకణబద్ధులు కావాలని సరికొత్త విజన్‌ను ఆవిష్కరించారు. రాజకీయ పక్షాలు, ప్రభుత్వం, ఆయా విభాగాలు పూర్తిస్థాయిలో భాగస్వాములైతేనే ఈ విజన్ సాకారమౌతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ‘ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్’ సంస్థ ఆధ్వర్యంలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైలాగ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అన్న అంశంపై ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సదస్సులో పాల్గొన్న పలువురు నిపుణులు పలు అంశాలపై గ్రేటర్‌ను విశ్వనగరంగా మార్చాలంటే ప్రభుత్వ విజన్ ఎలా ఉండాలో నిర్దేశించారు. ఈ సదస్సులో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, కరుణా గోపాల్, జి.రామేశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, వేదకుమార్, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, నరసింహారెడ్డి, కేశవ్, తిలోత్తమ్, సక్సేనా, శ్రావ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాల్లో విశ్వనగర విజన్ ఇలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
పర్యావరణం..
ప్రస్తుత పరిస్థితి: గ్రేటర్ పరిధిలో ఫార్మా పరిశ్రమలు.. వాహన విస్ఫోటనంతో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. త్వరలో మన సిటీ ఢిల్లీని అధిగమించనుంది. గాలిలో చేరుతోన్న అతి సూక్ష్మధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో చేరి గుండెపోటుకు కారణమవుతున్నాయి.
విజన్ ఇదీ:
రోజువారీగా పరిశ్రమలు, వాహనాలు, ఇతరత్రా ఎన్ని టన్నుల కాలుష్యం గాలిలో కలుస్తుందో శాస్త్రీయంగా లెక్కించాలి. కాలుష్యానికి కారణమవుతున్న వారిని గుర్తించి కట్టడి చేయాలి. గ్రేటర్‌వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత కాలుష్యం నమోదవుతుందో మొబైల్యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ప్రతి సిటిజన్‌కు ఉండాలి.
మూసీ, సాగర్, చెరువుల పరిరక్షణ
ప్రస్తుత పరిస్థితి:
చారిత్రక మూసీ నది డంపింగ్‌యార్డుగా మారింది. అడుగడుగునా ఆక్రమణలతో మూసీ చిన్నబోయింది. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సుమారు 185 చెరువులు కాలుష్యకాసారంగా మారాయి.
విజన్ ఇదీ:
మూసీ, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు తక్షణం నడుంబిగించాలి. పారిశ్రామిక వాడల్లోనే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పి శుద్ధిచేసిన అనంతరమే మూసీలోకి వదలాలి. జలాశయాలు, మూసీపై ఆక్రమణలు తొలగించాలి.
తీరైన రహదారులు
ప్రస్తుత పరిస్థితి:
గ్రేటర్లో రహదారులు అడుగుకో అగాథంలా మారాయి. ట్రాఫిక్, గుంతల రోడ్లపై ప్రయాణం తో జనం నడుమునొప్పితో కుదేలవుతున్నారు.
విజన్: రహదారులను విస్తరించాలి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆక్రమణలను నిరోధించి తీరైన ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలి. మల్టీలెవల్ ఫ్లైఓవర్ల కన్నా రోడ్ల విస్తరణ, గుంతలను తక్షణం పూడ్చి సిటిజన్లకు ఉపశమనం కల్పించాలి.
ప్రజారవాణా..
ప్రస్తుతం: గ్రేటర్లో వాహన విస్ఫోటనం జరుగుతోంది. నిత్యం 50 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండటంతో ట్రాఫికర్ సిటిజన్లను బెంబేలెత్తిస్తోంది.
విజన్: మెట్రో రైళ్లతోపాటు బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్) వంటి ప్రజారవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఉంటేనే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ప్రజారవాణా వినియోగం పెరుగుతుంది.
నిరంతర నీటిసరఫరా..
ప్రస్తుతం:
వందల కిలోమీటర్ల దూరం నుంచి సిటీకి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాల్లో 40 శాతం సరఫరా నష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
విజన్:
గ్రేటర్లో ప్రతి వ్యక్తికీ నిత్యం 150 లీటర్ల తాగునీటిని నిరంతరాయంగా(24 గంటలపాటు) సరఫరా చేసేలా సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలి.
మురుగు నీటిపారుదల వ్యవస్థ
ప్రస్తుతం:
గ్రేటర్ శివార్ల లో పదకొండు మున్సి పల్ సర్కిళ్ల పరిధిలో డ్రైనేజి వ్యవస్థ లేక 40 లక్షల మంది సతమతమవుతున్నారు.
విజన్:
గ్రేటర్ హైద రాబాద్ వ్యాప్తంగా సమగ్ర మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,100 కోట్లతో డ్రైనేజి మాస్టర్‌ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలి.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి
గ్రేటర్లో మూసీ, సాగర్ ప్రక్షాళనతోపాటు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
– ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త
మహిళల భద్రతకు పెద్దపీట వేయాలి
గ్రేటర్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వారు స్వేచ్ఛగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వాతావరణం కల్పించాలి. ఆయా సమస్యల పరిష్కారానికి పౌరసమాజం నుంచి ప్రభుత్వం అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలి.
– శ్రావ్యారెడ్డి, విఅండ్షి ఫౌండేషన్ అధ్యక్షురాలు