
5.5-5.9 శ్రేణిలో జీడీపీ వృద్ధి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆహారం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుదల ధోరణి ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడుతుందని ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 5.9 శాతం శ్రేణిలో నమోదుకావచ్చన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంప్రదింపుల కమిటీ సమావేశంలో శుక్రవారం మాట్లాడిన మోదీ, అధిక స్థాయిలో వృద్ధి సాధనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దీనితోపాటు పొదుపుల పెంపు, ద్రవ్య స్థిరత్వం, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, పెట్టుబడులకు ఊపునివ్వడం ప్రభుత్వ ఇతర ప్రాధాన్యతాంశాలని అన్నారు. తయారీ, మౌలిక, ఎగుమతుల రంగాలకూ ఊపునివ్వాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. అధిక పన్ను రిఫండ్స్ ద్రవ్యలోటు పెరగడానికి కారణమవుతోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆర్థిక శాఖ ఐదుగురు కార్యదర్శులు పాల్గొన్నారు.
లక్ష్యంలో 83 శాతానికి ద్రవ్యలోటు...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం ద్రవ్యలోటు లక్ష్యంలో, ఈ పరిమాణం సెప్టెంబర్ ముగింపునకే 83 శాతానికి చేరినట్లు శుక్రవారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. 2014-15లో ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యం రూ.5.31 లక్షల కోట్లుకాగా (జీడీపీలో 4.1 శాతం), సెప్టెంబర్ ముగింపు నాటికే ఈ పరిమాణం రూ.4.38 లక్షల కోట్లకు చేరింది.