అసాధారణ నగదు లావాదేవీలపై ఐటీ దృష్టి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 8 తర్వాత అసాధారణ స్థాయిలో నగదు డిపాజిట్లు చేసిన వ్యాపార సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో అమ్మకాలకు సంబంధించి భారీగా నగదు లావాదేవీలు చూపిన సంస్థల ఖాతాలను పరిశీలించనుంది. వ్యాపార ఆదాయాలుగా చూపుతూ.. నల్లధనాన్ని డిపాజిట్ చేశాయా అన్నది నిర్ధారణ చేసుకునేందుకు ఆయా సంస్థల అమ్మకాలు, నిల్వల గణాంకాల్లో అసాధారణ మార్పులేమైనా ఉన్నాయేమో చూడనుంది. గతంలో అదే వ్యవధిలో సాధారణంగా నమోదైన అమ్మకాల లావాదేవీలతో ఈ గణాంకాలను సరిపోల్చుకోనుంది. ‘డీమోనిటైజేషన్ అనంతరం పాత నోట్లతో సక్రమమైన పన్నులు చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
కానీ అమ్మకాలు భారీగా ఎగిసినట్లు చూపిస్తూ.. పలు వ్యాపార సంస్థలు అధిక మొత్తంలో పన్నులు (వ్యాట్, ఎక్సైజ్ సుంకం) కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసాధారణంగా కనిపించే నగదు లావాదేవీలపై దృష్టి సారించాలని నిర్ణయించడం జరిగింది అని ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కసరత్తులో భాగంగా ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనుమానాస్పద వ్యాపార సంస్థల నెలవారీ అమ్మకాల గణాంకాలను పరిశీలించనుంది. అలాగే నగదు డిపాజిట్ చేసిన తర్వాత సంస్థకు సంబంధం లేని బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయడం, కల్పిత కొనుగోళ్ల రూపంలో నిల్వలను పెంచి చూపించడం మొదలైన అంశాలపైనా దృష్టి పెట్టనుంది.