ఆ ఖాతాదారుల వివరాలివ్వండి
► కరెంట్ ఖాతాల్లో రూ.12.5 లక్షలు, అంతకుమించి డిపాజిట్ చేసినవారిపై ఐటీ శాఖ నజర్
► సేవింగ్ ఖాతాల్లో రూ. 2.5 లక్షలు, అంతకన్నా ఎక్కువ జమచేసిన వారిపైనా కన్ను
► ఈ నెల 31లోపు వివరాలు అందించాలని బ్యాంకర్లకు ఆదేశం
► సమాచారం పంపకుంటే విచారణ తప్పదని హెచ్చరిక
► ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌పై బ్యాంకర్లకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ పోరును వేగవంతం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 31 వరకు లెక్కకు మించిన సొమ్ము పలు ఖాతాల్లో డిపాజిట్ అయినట్టు గుర్తించింది. ఈ మేరకు బ్యాంకర్ల నుంచి సంబంధిత ఖాతాదారుల వివరాలను అందించాలని ఆదేశించింది. ఆ ఖాతాదారుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తమకు చేరవేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై బుధవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా హాజరైన బ్యాంకర్లకు ఐటీ ఇంటెలిజెన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ బీవీ గోపీనాథ్ శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా బ్యాంకులు తాము అడిగిన వివరాలివ్వడంతో ఆలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఈ నెలాఖరుకల్లా ఖాతాదారుల పూర్తి వివరాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేయాలని స్పష్టంచేశారు. అడిగిన వివరాలు ఇవ్వని ఏపీజీవీబీ, దక్కన్ గ్రామీణ బ్యాంక్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని కరెంట్ అకౌంట్‌లో రూ.12.5 లక్షలు, అంతకు మించి డిపాజిట్ అయిన ఖాతాదారుల వివరాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఈ నెలాఖరుల్లా అప్‌లోడ్ చేయాలని సూచించారు.
అలాగే సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులకు సంబంధించి రూ.2.5 లక్షలు, అంతకుమించి జమ చేసినట్టుగా ఉంటే వారి వివరాలను పంపాలని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 8 వరకు ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ వివరాలు కూడా పంపాలని ఆదేశించారు. ఈ డిపాజిట్‌దారుల ఆర్థిక మూలాలు, ఇతరత్రా వివరాలపై ఐటీ శాఖ విచారణ జరుపుతుందని తెలిపారు.
విచారణ, జరిమానా కూడా..
తాము అడిగే వివరాలను బ్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 31లోపు పంపించాలని, లేకపోతే బ్యాంకులపై విచారణ జరపాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐటీ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. తమకు సహకరించని బ్యాంకులకు భారీ స్థాయిలో జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు.
డేటాబేస్‌లో కోటి మంది జాబితా
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ చేస్తున్న కసరత్తులో భాగంగా కోటి మంది ఖాతాదారుల జాబితాను డేటాబేస్‌లో నిక్షి ప్తం చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కోటి మందిలో ఐటీ నిబంధనలు ఉల్లం ఘించిన వారి వివరాలను సేకరిస్తున్నా మని, త్వరలోనే సంబంధిత డిపాజిట్‌దా రులను విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు.