ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి కసరత్తు
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన
♦ బ్యాంకింగ్ సామర్థం పెంపుపై
♦ దృష్టి పెడతామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు తాజా పెట్టుబడులను అందించి, పటిష్టపర్చిన అనంతరం వాటి విలీనాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యం పెంపునకూ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ‘భారత్ ఆకాంక్షలు-ఆర్థిక అవసరాలను కేపిటల్ మార్కెట్లు ఎలా నెరవేర్చగలుగుతాయి’ అన్న అంశంపై ఎన్‌ఎస్‌ఈ, ఐఐఎఫ్, ఎగ్జిమ్ బ్యాంక్‌తో కలిసి ఐఎఫ్‌సీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సులో జైట్లీ మాట్లాడారు. అందుబాటులో ఉన్న వనరులకు లోబడి ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం సమకూర్చడం, వాటి పటిష్టతే ధ్యేయంగా కేంద్రం ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వడ్డీరేట్లు తగ్గుతున్న వ్యవస్థలో తయారీ రంగం మరింత పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అవుతుందన్నది తమ విశ్వాసమని అన్నారు. గడచిన ఏడాదిన్నరగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వృద్ధికి దోహదపడే ‘సరళతర విధానం’ దిశగా అడుగులు వేయడం హర్షణీయ పరిణామమని అన్నారు. రేటు కోతకు తగిన స్థూల ఆర్థిక అంశాలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, విదేశీ మారకపు నిల్వల వంటి స్థూల ఆర్థికాంశాలు పటిష్టంగా ఉన్నట్లు వివరించారు.
వ్యాపార వాతావరణం మెరుగుకు కృషి
దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నమంతా చేస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పారదర్శకత నెలకొల్పడానికి తగిన చర్యలు అన్నీ తీసుకుంటున్నామన్నారు. తక్కువ స్థాయిలో చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశంగా వివరించారు. దిగుమతులు పడిపోవడానికి అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కారణమని పేర్కొన్న జైట్లీ.. ఇలాంటి ఒడిడుడుకులు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరని అన్నారు.
అంతర్జాతీయంగా ఎన్నో అవరోధాలు ఉన్నా... భారత్ వృద్ధి తగిన ఆర్థిక ఫలితాలను కొనసాగిస్తోందని వివరించారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న రంగాల్లో వ్యవసాయం ఒకటని అన్నారు. రెండేళ్ల నుంచీ నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముద్ర పథకం కింద గత ఆర్థిక సంవత్సరం దాదాపు మూడు కోట్ల మందికి రుణాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు.
25 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి
దేశ వ్యాప్తంగా 25 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దేశంలో దాదాపు 160 ఎయిర్‌స్ట్రిప్స్ నిరుపయోగంగా పడిఉన్నట్లు పేర్కొన్నారు. విమానయాన రంగం పురోగతికి తగిన అన్ని ప్రయత్నాలనూ కేంద్రం చేస్తున్నట్లు తెలిపారు.