
న్యూఢిల్లీ: జీఎస్‌టీ ఆదాయం జూలై నెలలో తిరిగి గాడిన పడింది. పన్ను వసూళ్లు అంతకుముందు నెలలో ఉన్న రూ.95,610 కోట్ల నుంచి రూ.96,483 కోట్లకు పెరిగాయి. ఈ వే బిల్లు అమలు చేశాక నిబంధనల అమలు పెరగడం సానుకూల ఫలితాన్నిచ్చింది. జూలైలో 66 లక్షల వ్యాపార సంస్థలు రిటర్నులు దాఖలు చేశాయి. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జీఎస్‌టీఆర్–3బీ రిటర్నులు ఈ స్థాయిలో దాఖలవడం ఇదే ప్రథమం. పన్ను వసూళ్లు అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.03 లక్షల కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.94,016 కోట్లుగా నమోదయ్యాయి. జూన్‌లో రూ.95,610 కోట్లుగా ఉన్నాయి. పన్ను ఎగవేతలను నివారించేందుకు తీసుకొచ్చిన ఈ–వే బిల్లు కారణంగా జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయని, అయితే బడ్జెట్ అంచనా సగటు నెలవారీ వసూళ్ల కంటే తక్కువే ఉన్నట్టు ‘ట్యాక్స్‌మన్’ సంస్థ డీజీఎం విషాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment