
మూడు రోజుల్లో లెసైన్స్
హైదరాబాద్, బిజినె స్ బ్యూరో: వ్యాపార లెసైన్సును మూడు రోజుల్లో జారీ చేస్తామని భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి శైదా మొహమ్మద్ అబ్దాలి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వ్యాపార అవకాశాలు అన్న అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో గురువారమిక్కడ జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తయారీ, నిర్మాణ, వ్యవసాయం, గనులు, ఎగుమతులు తమకు ప్రాధాన్య రంగాలని వివరించారు.
పన్ను విరామం, దీర్ఘకాలిక లీజుపై స్థల కేటాయింపు, పన్ను మినహాయింపులు వంటి ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. ‘సీమాంతర ఉగ్రవాదం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ బాధిత దేశమైంది. మూడు దశాబ్దాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రస్తుతం భద్రత విషయంలో పరిస్థితులు మెరుగు పడ్డాయి. ఇందుకు ఇటీవల ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలే నిదర్శనం’ అని తెలిపారు.
3 ట్రిలియన్ల కంటే..
భారత్‌కు చెందిన 100 కంపెనీలు మాత్రమే అఫ్గనిస్తాన్‌లో అడుగు పెట్టాయి. ఈ సంఖ్య అతి స్వల్పం అని శైదా మొహమ్మద్ అబ్దాలి అన్నారు. ఖనిజ నిక్షేపాల విలువ 3 ట్రిలియన్ల కంటే అధిక ంగా ఉంటుందని చెప్పారు. కొత్తగా 18,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి. 80 లక్షల టన్నుల సిమెంటును పొరుగు దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. వైద్యం కోసం మా దేశం నుంచి భారత్‌కు వెళ్తున్నారు. నిల్వ సామర్థ్యం లేక ఆహారోత్పత్తులు వృధా అవుతున్నాయి.
సరిపడ పాఠశాలలు, కళాశాలలు లేవు. దేశప్రజలందరికీ ఎలక్ట్రానిక్ ఐడీ కార్డులు ఇవ్వబోతున్నాం. 3జీ, ఇంటర్నెట్ విషయంలో 5 ఏళ్ల ప్రణాళిక ఉంది. విమానయాన సేవలు విస్తరించనున్నాం. అవకాశాలు అందుకోవడమే తరువాయి’ అని పారిశ్రామికవేత్తలను ఉద్ధేశించి అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన చొరవ కారణంగా సార్క్ దేశాల మధ్య మైత్రి బలపడుతుందని అన్నారు.
పోర్టు విస్తరణతో..
భారత్-ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.3,600 కోట్లుంది. రూ.600 కోట్ల వ్యయంతో చేపడుతున్న చాబహార్ నౌకాశ్రయం విస్తరణ ప్రాజెక్టు పూర్తి అయితే కొన్నేళ్లలో ఈ విలువ రూ.18 వేల కోట్లను మించుతుందని చెప్పారు. భారత్‌తో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యామని పేర్కొన్నారు. తుర్క్‌మెనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్-ఇండియా పైప్‌లైన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని భద్రతా సమస్యల కారణంగా ఆఫ్ఘనిస్తాన్- భారత్‌ల మధ్య సరుకు రవాణా ప్రభావితమవుతోందని వివరించారు.