‘బ్లాక్’ ఇండియా..!
భారత్‌లో పోగుపడిన నల్లధనం రూ. 30 లక్షల కోట్లకు పైనే...
♦ జీడీపీలో ఇది 20 శాతానికి సమానం...
♦ థాయ్‌లాండ్, అర్జెంటీనాల జీడీపీలకంటే అధికం
♦ కానీ దేశంలో 1990ల నుంచీ తగ్గుతూ వస్తోంది...
♦ యాంబిట్ క్యాపిటల్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు కొరకరానికొయ్యగా మారిన నల్లధనం (బ్లాక్ మనీ) సమస్య భారత్‌నూ పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం దేశంలో రూ.30 లక్షల కోట్లకు పైగా బ్లాక్ మనీ చలామణీలో ఉన్నట్లు యాంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ తాజా నివేదిక పేర్కొంది. అయితే, కొన్నేళ్లుగా నల్లధనం క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోందని పేర్కొనటం గమనార్హం. ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో నల్లధనం విలువ 20 శాతం పైగానే ఉందని, థాయ్‌లాండ్, అర్జెంటీనాల జీడీపీ కంటే భారత్‌లో బ్లాక్ మనీ విలువ ఎక్కువని ఈ సంస్థ పేర్కొంది. కాగా, నల్లధనం సమస్య వల్ల నిధుల సమీకరణ భారంగా మారుతోందని.. ఏడాది క్రితం అనధికారిక వడ్డీ వ్యాపారంలో రుణ రేట్లు (వార్షికంగా) దాదాపు 24% ఉండగా, ఇప్పుడు గరిష్టంగా 34%కి ఎగబాకినట్లు కూడా నివేదిక పేర్కొంది.
బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి రాకుండా ప్రజల వద్ద పోగుపడిన లెక్కల్లో చూపని సొమ్మును నల్లధనంగా వ్యవహరిస్తారు. కాగా, నల్లధనంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నగదు రూపంలో లావాదేవీలు పెరిగిపోతున్నాయని ఈ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ‘‘దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా లావాదేవీలు తగ్గి, డిపాజిట్ల వృద్ధి రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఈ ప్రభావంతో ప్రస్తుత ఏడాది జీడీపీ వృద్ధి రేటులో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు’’ అని యాంబిట్ అభిప్రాయపడింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ...
♦ 1970, 80వ దశాబ్దాల్లో భారత్‌లో నల్లధనం భారీగా పెరిగింది. కానీ ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది.
♦ ఈ ఏడాది(2016) దేశ జీడీపీ 2.3 లక్షల కోట్ల(ట్రిలియన్) డాలర్లుగా అంచనా. దీంతో పోలిస్తే నల్ల ధనం విలువ 20%(46,000 కోట్ల డాలర్లు-రూ.30 లక్షల కోట్లకు పైనే)గా ఉంటుందని అంచనా.
♦ ప్రధానంగా రియల్ ఎస్టేట్, బంగారం వంటి ఆస్తుల్లో నల్లధనం అత్యధికంగా పోగుపడింది.
♦ఫైనాన్షియల్ పొదుపు సాధనాలకంటే భౌతికపరమైన ఆస్తుల్లోనే భారతీయులు ఎక్కువగా డబ్బును దాచుకోవడానికి మొగ్గుచూపిస్తున్నారు. బ్లాక్ మనీ చలామణీకి ఈ భౌతిక ఆస్తులు అనువుగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం.
♦ కచ్చితమైన గణాంకాలేవీ లేనప్పటికీ... దేశ రియల్టీ రంగంలోకి 30% నిధులు నల్లధనం రూపంలోనే వస్తున్నాయనేది విశ్లేషకుల మాట.
♦మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పసిడి కొనుగోళ్లను కట్టడి చేయడంతో నల్లధనం లావాదేవీలకు బంగారాన్ని ఉపయోగించుకోవడం కాస్త తగ్గింది. బంగారానికి డిమాండ్ తగ్గింది కూడా అందుకే.
♦ ప్రభుత్వం నల్లధనం అడ్డుకట్టకు తీసుకుంటున్న కఠిన చర్యల ప్రభావంతో భూముల ధరలు, రియల్టీ రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి.
♦ వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉండటం, బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత నగదు సరఫరా లేకపోవడంతో గడచిన ఏడాది కాలంలో నిధుల సమీకరణ భారం సగటున 30 బేసిస్ పాయింట్లు(0.3 శాతం) ఎగసింది. ఆర్‌బీఐ పాలసీ రేట్లు ఇదే కాలంలో 100 బేసిస్ పాయింట్లు(1 శాతం) తగ్గడం గమనార్హం.
♦ మరోపక్క, మొండిబకాయిల సమస్య కారణంగా బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకురాకపోవడంతో... రుణ డిమాండ్ దిగజారింది. అనధికారిక వడ్డీవ్యాపారం పెరిగిపోవడానికి దారితీస్తోంది.