న్యూఢిల్లీ: చౌకగా హోటల్ గదులను అందుబాటులోకి తెచ్చిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తాజాగా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ప్రీమియం కాఫీ చెయిన్, రెస్టారెంట్లు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ది ఫ్రెంచ్ ప్రెస్ పేరుతో 50 పైగా ప్రీమియం కాఫీ షాప్‌లను ఏర్పాటు చేసేందుకు ఓయో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాలుగు క్లౌడ్ కిచెన్స్ చేతిలో ఉన్నందున .. వాటి ఊతంతో రెస్టారెంట్ చెయిన్ కూడా ప్రారంభించాలని ఓయో భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ రూమ్స్‌ను చౌకగా అందుబాటులోకి తెచ్చిన కారణంగా ఓయోపై ’చౌక’ బ్రాండ్ అనే ముద్ర పడిపోయిన సంగతి తెలిసిందే.
కానీ ప్రీమియం కాఫీ చెయిన్‌పై ఈ ముద్ర పడకుండా చూసుకోవాలని ఓయో భావిస్తోంది. అందుకే తన బ్రాండ్ పేరు ఎక్కడా కనిపించకుండా ది ఫ్రెంచ్ ప్రెస్ బ్రాండ్ కింద ఈ కాఫీ చెయిన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రీమియం కాఫీ చెయిన్ విభాగంలో ఎక్కువ సంస్థలు లేకపోవడంతో స్టార్‌బక్స్ వంటి దిగ్గజంతో పోటీపడొచ్చని, ఇందుకు కావల్సిన పూర్తి సామర్థ్యాలు తమకున్నాయని ఓయో భావిస్తోంది. అయితే, ఓయో అంటే చౌకైన, అందుబాటు ధర బ్రాండ్ అనే ముద్ర ఉన్న సంగతి కూడా దానికి తెలుసు. అందుకే కాస్త ఖరీదైన ఈ టార్గెట్ మార్కెట్ కోసం ఓయో బ్రాండింగ్ వాడకూడదని నిర్ణయించుకుంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ట్రయల్ రన్..
ఓయో ఇప్పటికే ఓయో టౌన్‌హౌసెస్ హోటళ్లలో ది ఫ్రెంచ్ ప్రెస్ ఔట్‌లెట్స్‌ను కొన్నింటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. పెద్ద మాల్స్, కాస్త ఖరీదైన ఏరియాల్లో మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌ల్లోని ఓయో కో–వర్కింగ్ స్పేస్‌లలోనూ వీటిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలను ధృవీకరించేందుకు ఓయో నిరాకరించింది. ఫుడ్ అండ్ బేవరేజెస్ వ్యాపారంలో కూడా తమ కార్యకలాపాలు ఉన్నాయని, ఫుల్ సర్వీస్ హోటల్స్‌లో నిర్వహించే కిచెన్స్ ద్వారా తమ ఆదాయంలో 25 శాతం వాటా వస్తోందని పేర్కొంది. ప్రస్తుతానికి మాత్రం మిగతా కార్యకలాపాల విస్తరణపై స్పందించబోమని వివరించింది.
ప్రీమియం రెస్టారెంట్లపై దృష్టి..
ఓయో ఇప్పటికే అద్రక్, ఓ బిరియానీ, పరాఠా పండిట్, మాస్టర్ ఆఫ్ మోమోస్ పేరుతో నాలుగు క్లౌడ్ కిచెన్ బ్రాండ్స్ నిర్వహిస్తోంది. ది ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ చెయిన్‌ను విస్తరించిన తర్వాత ప్రీమియం రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేయాలని ఓయో ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ సొంత హోటళ్లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలు, స్టాండెలోన్ రెస్టారెంట్లలోనూ వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ రెస్టారెంట్ల కోసం క్లౌడ్ కిచెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని ఓయో యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment