7% తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 7 శాతం క్షీణించి 1.95 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. సుంకాల విధానంలో మార్పులు, చైనా నుంచి సరఫరాలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణమని సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) వెల్లడించింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ1లో భారత్‌లో మొత్తం మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్ (ఫీచర్ ఫోన్లు సహా) 15 శాతం క్షీణించి 5.3 కోట్ల యూనిట్లకు తగ్గింది. చాలా మటుకు కొత్త హ్యాండ్‌సెట్స్ 2014 క్యూ4లోనే వచ్చేయడంతో 2015 క్యూ1లో మొబైల్స్ మోడల్స్‌పై ఆసక్తి తగ్గిందని సీఎంఆర్ లీడ్ అనలిస్ట్ టెలికమ్ రీసెర్చ్ ఫైసల్ కవూసా తెలిపారు.
మరోవైపు కొరియా హ్యాండ్‌సెట్ దిగ్గజం శాంసంగ్..స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన వాటాను 23.7 శాతం నుంచి 27.9 శాతానికి పెంచుకుంది. ఎంట్రీ లెవల్ నుంచి హై ఎండ్ దాకా మూడు సెగ్మెంట్లలో కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టడం శాంసంగ్‌కు లాభించినట్లు కవూసా వివరించారు. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో 17.8 శాతం నుంచి 16.2 శాతానికి మార్కెట్ వాటా తగ్గడంతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో నిల్చింది. 9.2 శాతం మార్కెట్ వాటాతో ఇంటెక్స్ మూడో స్థానంలో ఉంది. సీజన్ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు పూర్తిగా ఆన్‌లైన్ అమ్మకాలపై ఆధారపడకుండా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని సీఎంఆర్ టెలికం అనలిస్ట్ కర్ణ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.