కెన్యాలోని సుప్రసిద్ధ ఫించ్ హటన్స్‌లో నేను కొత్త సంవత్సర వేడుకల్ని ఆస్వాదిస్తున్నా. అక్కడ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్‌తో మాటమాట కలిసింది. కొంతకాలంగా సఫారీ క్రికెట్‌ను కవర్ చేస్తున్న ఆయనతో భారత్–దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించిన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఇరు జట్ల మధ్య సిరీస్ రసవత్తరంగా జరుగుతుందని విశ్లేషించారు. ప్రస్తుత భారత జట్టు లైనప్, అనుభవం దృష్ట్యా గతంలో సఫారీలో ఓడినట్లుగా ఈసారి జరగదన్నారు. భారత ప్రేక్షకులు ఈ క్రికెట్ విందును ఆస్వాదించవచ్చని చెప్పుకొచ్చారు. నిజమే..! గత ఫలితాలను చూసి జరగబోయే సిరీస్‌నూ తేలిగ్గా అంచనా వేస్తే అది తెలివితక్కువ తనమే అవుతుంది. కానీ ఓ విశేష అనుభవజ్ఞుడు చెబితే మాత్రం అది నిజమవుతుంది. హోల్డింగ్ చెప్పింది అదే! బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన అనుభవం సంపాదించింది. ఇంతకుముందు బౌన్సీ వికెట్‌పై తెల్లబోయినట్లు ఇప్పుడు జరగకపోవచ్చు. భారత ఓపెనర్లు ఇప్పటికే చాలాసార్లు స్టెయిన్, మోర్కెల్‌ల బౌన్సర్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా భయపడాల్సిన పనిలేదు. మొండిగా పోరాడే పుజారా గతంలోనే ఇక్కడ భారీ సెంచరీ చేశాడు.
కోహ్లి కూడా సెంచరీలతో చేలరేగాడు. రహానే ఇప్పుడు గొప్ప ఫామ్‌లో లేకపోవచ్చు... కానీ విదేశాల్లో అతనికి మెరుగైన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తప్పకుండా రాణిస్తుందనే చెప్పాలి. ఇక పేసర్లు కూడా అంతే. అనుభవం నేర్పిన పాఠాలతో రాటుదేలారు. లైన్ అండ్ లెంగ్త్‌పై మంచి అవగాహనతో ఉన్నారు. సీనియర్ స్పిన్నర్ల సంగతి సరే సరి. పిచ్ నుంచి ఏ మాత్రం టర్న్ దొరికినా ఏ ఒక్కరిని విడిచిపెట్టరు. దక్షిణాఫ్రికాకు ఇవేవి తెలియని విషయాలు కాదు... అందుకే పూర్తిస్థాయి జట్టుతో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై వచ్చే అనుకూలతలతో పాటు డివిలియర్స్ తిరిగి జట్టులోకి చేరడం దక్షిణాఫ్రికా బలాన్ని పెంచింది. ఓపెనింగ్‌లో మాత్రం ఎల్గర్, మర్‌క్రమ్‌లు ఈ సీజన్‌లో నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనలేదు. ఇప్పుడు భారత బౌలర్ల రూపంలో వాళ్లకు సవాల్ ఎదురుకానుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నాడు. కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందిపెడుతున్నాడు. ఇలాంటి వైరివర్గాలతో పోటీ రేకెత్తిస్తున్న ఈ సిరీస్ కోసం ఇంకా వేచిచూడటం కష్టమేమో!
భారత్... అప్పటిలా లేదు!
Published Thu, Jan 4 2018 1:06 AM | Last Updated on Thu, Jan 4 2018 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment