• రూ. లక్ష కోట్లకు చేరిన బ్యాలెన్స్ షీట్
• ఒక్కో షేర్‌కు రూ.9 మధ్యంతర డివిడెండ్
ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.751 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో రూ.602 కోట్లుగా ఉన్న నికర లాభంతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.1261 కోట్లకు చేరడంతో నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని కంపెనీ వైస్–చైర్మన్, ఎండీ గగన్ బంగా పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
నిలకడగా రుణ నాణ్యత: అందుబాటు ధరల గృహ రుణాల జోరుతో మొత్తం గృహ రుణాలు 30 శాతం వృద్ధి సాధించడంతో తమ బ్యాలెన్స్ షీట్ ఈ క్యూ3లోనే రూ. లక్ష కోట్ల (1 ట్రిలియన్)ను మించిందని బంగా వివరించారు. 2019–19 కల్లా రూ. లక్షన్నర కోట్ల మైలురాయిని అందుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తమపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం లేదని, అందుబాటు ధరల గృహ రుణాలు రూ.6,000 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆదాయ, వ్యయ నిష్పత్తి 14.3 శాతం నుంచి 13.8 శాతానికి తగ్గడం వల్ల కూడా నికర లాభం పెరిగిందని చెప్పారు. రుణ వ్యయాలు 74 బేసిస్ పాయింట్ల స్థాయిలోనే నిలకడగా ఉన్నాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 0.85 శాతంగా, నికర మొండి బకాయిలు 0.36 శాతంగా ఉన్నాయని వివరించారు.
ఇండియాబుల్స్ లాభం రూ.751 కోట్లు
Published Sat, Jan 21 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
Advertisement