ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,030 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.840 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
రుణ వృద్ధి మెరుగుపడడం, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం పెరగడం వల్ల లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ వైస్–చైర్మన్, ఎమ్‌డీ గగన్ బంగా చెప్పారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పుణే తదితర నగరాల్లో గృహ రుణాలకు డిమాండ్ బాగా ఉందని పేర్కొన్నారు.
తగ్గిన మొండి బకాయిలు..
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,906 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో రూ.3,847 కోట్లకు పెరిగిందని గగన్ బంగా తెలిపారు. వ్యాపారం రూ.1,03,705 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.1,31,903 కోట్లకు పెరిగిందని వివరించారు.
స్థూల మొండి బకాయిలు 0.85 శాతం నుంచి 0.77 శాతానికి, నికర మొండి బకాయిలు 0,36 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయని తెలిపారు. ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి 13.3 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్ 1 శాతం నష్టంతో రూ.1,355 వద్ద ముగిసింది. ఇంట్రేడేలో ఈ షేర్ 1 శాతానికి పైగా లాభపడి రూ.1,385ను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment