
బ్యాంకులది ఒడిదుడుకుల బాటే!
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక
వాషింగ్టన్: భారత్ బ్యాంకులది ఒడిదుడుకుల బాటేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. లాభాలు తగ్గడం, మొండిబకాయిల బరువు దీనికి కారణంగా వివరించింది. ‘గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. మొండిబకాయిల గురించి ప్రత్యేక, అదనపు, సకాల చర్యలు అవసరమని సూచించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) రుణాల్లో స్థూల మొండిబకాయిలు 2014-15లో 5.32% (రూ.2.67 లక్షల కోట్ల) ఉంటే ఈ పరిమాణం 2015-16లో 9.32%కి (రూ.4.76 లక్షల కోట్లు) పెరగడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గత 12 నెలల్లో 39 లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 96% పెరిగాయి. 2016 జూన్ నాటికి రూ.6.3 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ భారత్ బ్యాం కింగ్‌కు సంబంధించి సంస్థ విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు...
⇔ ఎన్‌పీఏలతో ఇందుకు సంబంధించి అదనపు ప్రొవిజనింగ్ (కేటాయింపులు) బ్యాంకింగ్‌కు భారంగా మారతాయి. దీనితో వ్యవస్థకు మరింత అధిక మొత్తంలో మూలధనం అవసరం అవుతుంది.
⇔ సమస్య పరిష్కార దిశలో కార్పొరేట్ దివాలా చట్టాల సంస్కరణల పటిష్ట అమలు అవసరం. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్, ఈక్విటీకి రుణ మార్పిడి, సమగ్ర, పారదర్శక నియమ నిబంధనల అమలు ముఖ్యం.
⇔ కార్పొరేట్ రుణ ఒత్తిడులను ఎదుర్కొనే ఒక ప్రత్యేక యంత్రాంగమూ మొండిబకాయిల సమస్య పరిష్కారంలో కీలకం.
⇔ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు వర్ధమాన దేశాల్లోనూ మొండిబకాయిల సమస్య ఉంది. ఆయా దేశాల్లో బ్యాంకింగ్ పర్యవేక్షణ పటిష్టత అవసరం. అలాగే ప్రపంచవ్యాప్తంగా సమస్య తీవ్రమవకుండా నిరోధించే క్రమంలో వ్యవస్థలు, సెంట్రల్ బ్యాంకుల మధ్య సమన్వయ అవసరం ఎంతో ఉంది.
⇔ స్థిరమైన రాజకీయ వాతావారణ పరిస్థితి భారత్‌కు లాభిస్తున్న అంశాల్లో కీలకమైనది.
⇔ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సమస్య పరిష్కారంలో కీలకం.