భారీగా తగ్గిన భారత్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ
ముంబై: భారత్ కంపెనీల విదేశీ రుణ సేకరణ ఈ ఏడాది జూలైలో గణనీయంగా 44 శాతం తగ్గింది. 2015 జూలైలో ఈ రుణ సమీకరణ పరిమాణం 2.14 బిలియన్ డాలర్లుకాగా, 2016 జూలైలో ఈ మొత్తం 1.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇందులో 183.7 మిలియన్‌లు అప్రూవల్ రూట్‌లో వచ్చాయి. 1.02 బిలియన్ డాలర్లు ఆటోమేటిక్ చానెల్‌లో వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
అప్రూవల్ రూట్‌లో టికోనా డిజిటల్ నెట్స్‌వర్క్స్ 171 మిలియన్ డాలర్లు సమీకరించింది. విజయవాడ టోల్‌వే విషయంలో ఈ మొత్తం 11.07 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆటోమేటిక్ రూట్‌లో రుణాలు తెచ్చుకున్న సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ (446 మిలియన్ డాలర్లు), గ్లెన్‌మార్క్ ఫార్మా (200 మిలియన్ డాలర్లు), అదానీ ట్రాన్స్‌మిషన్ (74 మిలియన్ డాలర్లు), బిర్లా కార్పొరేషన్ (40 మిలియన్ డాలర్లు), సీమన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (37 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.