ఇక బ్రాండ్ ‘తాజ్’ ఒక్కటే!
ఇండియన్ హోటల్స్‌కు కొత్తరూపు..
• ఆతిథ్య సేవలన్నీ ఒకే బ్రాండ్ పేరుతో
• ఒక్కటి కానున్న తాజ్ హోటల్స్, ప్యాలసెస్, రిసార్ట్స్, సఫారీస్
• గేట్‌వే, వివాంటా హోటళ్లూ తాజ్ కిందకు
• డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి
ముంబై: టాటాగ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) పునర్నిర్మాణ ప్రక్రియ దిశగా చర్యలు ప్రారంభించింది. తన పరిధిలోని అన్ని హోటల్స్‌ను ‘తాజ్ హోటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్’ పేరుతో ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నట్టు ఐహెచ్‌సీఎల్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాజ్ హోటల్స్, తాజ్ ప్యాలసెస్, తాజ్ రిసార్ట్స్, తాజ్ సఫారీస్ అనే నాలుగు విభాగాలతో భిన్నమైన ఆతిథ్య సేవలు అందిస్తుండగా... ఇవన్నీ తాజ్ బ్రాండ్ కిందకు రానున్నాయి. నూతనంగా ఏర్పడే బ్రాండ్ స్వరూపం తాజ్ వారసత్వాన్ని గౌరవించే విధంగా, గొప్ప బ్రాండ్‌గా ఉంటుందని, తమ వాటాదారులకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా వివాంటా, గేట్‌వే పేర్లు కనుమరుగవుతాయి.
దేశంలోనూ, దేశం వెలుపల ఉన్న వివాంటా, గేట్‌వే హోటళ్లన్నీ తాజ్ బ్రాండ్ కిందకు వస్తాయని తాజ్ హటల్స్ ప్యాలసెస్ రిసార్ట్స్ సఫారీస్ సీఈవో, ఎండీ రాకేశ్ సర్నా గురువారం ముంబైలో విలేకరులకు తెలిపారు. పునర్నిర్మాణ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నాటికి ముగుస్తుందన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇండియన్ హోటల్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 64 చోట్ల 101 ప్రదేశాల్లో హోటళ్లు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద హోటళ్ల గ్రూపుగా ఇది కొనసాగుతోంది.
ఎనిమిదేళ్ల క్రితమే ప్రారంభం...
గేట్‌వే, వివాంటా పేరుతో ఎనిమిదేళ్ల క్రితమే హోటల్స్ ప్రారంభం అయ్యాయి. దేశీయ మార్కెట్‌లో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిచ్చే వ్యూహంలో భాగంగా ఐహెచ్‌సీఎల్ ఈ బ్రాండ్ల పేరుతో హోటళ్లను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అయితే, ఇవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ రెండు బ్రాండ్ల కింద అందిస్తున్న సేవల విషయమై కస్టమర్లలో అవగాహన లేదని ఐహెచ్‌సీఎల్ ఉద్యోగి ఒకరు స్వయంగా పేర్కొనడం గమనార్హం. తాజా ఏకీకరణ చర్యలతో దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య బ్రాండ్‌గా తాజ్ నిలుస్తుంది. ప్రధానంగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు, లాభాలను గడించడం, తాజ్ బ్రాండ్‌కు మరింత బలాన్ని తీసుకొచ్చేందుకు ఐహెచ్‌సీఎల్ తాజా చర్యలను చేపట్టినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.