
ఫిబ్రవరి 4-5 తేదీల్లో భారత పెట్టుబడుల సదస్సు
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 4, 5 తేదీల్లో దేశంలో పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. న్యూ ఢిల్లీలో జరిగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు పాల్గొంటారని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ బుధవారం ట్వీట్ చేశారు. భారత్ ఆర్థికవృద్ధి లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం... భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలుసహా పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సదస్సును ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.
రోడ్లు, రహదారులు, చమురు, గ్యాస్, రైల్వే మంత్రిత్వశాఖల అధికారులు ఈ సదస్సులో పాల్గొని ఆయా రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించే అవకాశం ఉంది. పలు గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.