పడితే కొనండి.. పెరిగినా అమ్మకండి
ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల్లో కదులుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ అందివ్వని విధంగా 22 శాతం లాభాలను మన సూచీలు అందించాయి. మార్కెట్ కొత్త శిఖరస్థాయిలకు చేరడంతో ఇక ఇక్కడ ఆగుతుందా లేక ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది చాలామంది ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే మన మార్కెట్లు అంత చౌకగా ఏమీ లేవు. 2014-15 రాబడులతో పోలిస్తే సెన్సెక్స్ 17 పీఈ వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇది సెన్సెక్స్ సగటు గరిష్ట ఈపీఎస్ విలువ కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ వాస్తవ విలువకు దగ్గరగానే ఉంది. సెన్సెక్స్ ఈపీఎస్ విలువ ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇది వాస్తవ రూపంలోకి వస్తే 2015-16 కంపెనీల ఆదాయాలు భారీగా పెరుగుతాయి. సహజంగానే ఈ అంశాన్ని స్టాక్ మార్కెట్లు ముందుగా డిస్కౌంట్ చేసుకుంటూ పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
అంతా సానుకూలమేట
అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే విధంగా చేస్తాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 101 డాలర్ల వద్ద కదులుతోంది. ఇది 100 డాలర్ల కిందకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే సబ్సిడీ భారం తగ్గి ద్రవ్యలోటు 4.7 శాతానికి కంటే దిగువకు చేరుతుంది. అంతేకాదు రుతుపవనాలు ఆలస్యంగానైనా కరుణించడంతో ముప్పుతప్పినట్లే. ఈ అంశాలన్నీ ఈ ఏడాది వృద్ధిరేటు 5.5 శాతానికి, వచ్చే ఏడాది 6.5 శాతానికి చేరుస్తాయి.
2015-16 ఆర్థిక ఏడాదికి వృద్ధిరేటు 6.5 శాతంగా అంచనా వేస్తే కంపెనీల ఆదాయాల్లో కనీసం 20 శాతం వృద్ధి అంచనా వేయొచ్చు. ఈ లెక్కన చూస్తే సెన్సెక్స్ ఈపీఎస్ 1,850గా ఉంటుంది. సెన్సెక్స్ చారిత్రక సగటు పీఈ నిష్పత్తి 16 లెక్కన అంచనా వేస్తే సెన్సెక్స్ 29,600 స్థాయికి ఎగబాకుతుంది. ఈ అంశాలన్నీ మార్కెట్లు 2015 ప్రారంభం నుంచే డిస్కౌంట్ చేసుకొని పెరగడం ప్రారంభిస్తాయని అంచనా వేస్తున్నాం.
పడితే కొనండి
సూచీలు గరిష్ట స్థాయిలో ఉండటంతో కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఈ కరెక్షన్‌కు దోహదం చేస్తున్నాయి. ఇలాంటి పతనం సమయంలో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తుం డండి. సహజంగా సెక్యులర్ బుల్ మార్కెట్ మధ్య మధ్యలో కొనుగోళ్లకు అవకాశం ఇస్తుంటుంది. మొదట్లో కొనలేక పోయిన వారు ఈ పతనాలను అందిపుచ్చుకోవాలి.
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కరణల పేరుతో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు బాగా లాభాలు అందించాయి. అలా అని చెప్పి అన్ని షేర్లను కాకుండా ఆచితూచి ఎంపిక చేసుకోండి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్‌కు చెందిన ఐటీ, ఫార్మా, సైక్లికల్స్ రంగాలకు చెందిన షేర్లను ప్రతీ పతనంలో కొనుగోలు చేస్తూ ఉండండి. దీర్ఘకాలం కొనసాగే సెక్యులర్ బుల్ మార్కెట్లో ‘పడితే కొనండి.. పెరిగినా అమ్మకండి’ అనే వ్యూహాన్ని అమలు చేయాలి.