హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గతేడాది 14.4 లక్షల మంది సింగపూర్‌ను పర్యటించారు. 2017తో పోలిస్తే సంఖ్య పరంగా ఇది 13 శాతం అధికం. 2015 నుంచి పర్యాటకుల సంఖ్య ఒక మిలియన్ మార్కును దాటుతోందని సింగపూర్ టూరిజం బోర్డు భారత్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఆసియా డైరెక్టర్ జి.బి.శ్రీధర్ తెలిపారు. మంగళవారమిక్కడ జరిగిన సింగపూర్ టూరిజం బోర్డు రోడ్ షో సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పర్యాటకుల పరంగా చైనా, ఇండోనేíసియా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కొన్నేళ్లపాటు ఇండియా తన ర్యాంకును కొనసాగిస్తుంది. ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి పర్యాటకుల సంఖ్య 12 శాతం వృద్ధి నమోదైతే, మెట్రోల నుంచి 8 శాతంగా ఉంది. ఇక క్రూయిజ్‌లో విహరించేవారిలో అత్యధికులు భారతీయులే. 2018లో 1.6 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించారు. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం అధికం. 16 భారతీయ నగరాల నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 10 దక్షిణాది నగరాలు కావడం విశేషం. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వీటిలో ఉన్నాయి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment