ఆర్థిక వ్యవస్థపై ‘నోట్ల రద్దు’ భారం
⇔ 2016–17లో వృద్ధి 7.1 శాతం
⇔ మూడేళ్ల కనిష్ట స్థాయి
⇔ తయారీ, సేవలు పేలవ పనితీరు
⇔ వ్యవసాయంలో చక్కటి వృద్ధి
న్యూఢిల్లీ: కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభావం గత ఆర్థిక సంవత్సరంపై (2016–17) తీవ్రంగానే పడింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మూడేళ్ల కనిష్ఠ స్థాయి 7.1 శాతంగా నమోదయింది. జీడీపీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న సేవల రంగం, అలాగే 15 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితనాన్ని కనబరిచాయి. అయితే ఒక్క మార్చి త్రైమాసికాన్ని చూసుకుంటే వృద్ధి రేటు కేవలం 6.1 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 7.9%. కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...
♦ 2015–16లో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం, అంతక్రితం ఏడాది ఈ రేటు 7.5 శాతం.
♦ వ్యవసాయ రంగం మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. 0.7 శాతం క్షీణత నుంచి 4.9 శాతం వృద్ధి బాటకు ఈ రంగం మళ్లింది. నాల్గవ త్రైమాసికంలో కూడా వ్యవసాయ రంగం వృద్ధి 1.5% నుంచి 5.2%కి చేరింది.
♦ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 5.6 శాతానికి పడిపోయింది. ఈ రేటు 2015 జనవరి–మార్చిలో 8.7 శాతం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 7.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. 2016 జనవరి–మార్చి నుంచీ వరుసగా ఐదు త్రైమాసికాల నుంచీ జీవీఏ తగ్గతూ వస్తోంది.
♦ డీమోనిటైజేషన్ కాలంలో నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్చి త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధిలేకపోగా –3.7%కి క్షీణించింది. 2015–16 ఇదే కాలంలో దీని వృద్ధి రేటు 6%.
♦ తయారీ, మైనింగ్, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, ఫైనాన్స్, రియల్టీ, ఫ్రొఫెషనల్ సర్వీసులు సహా మొత్తం సేవల వి భాగం నాల్గవ త్రైమాసికంలో మందగించాయి.
♦ తయారీ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతం నంచి 7.9 శాతానికి పడిపోయింది.
♦ మైనింగ్, క్వారీయింగ్ రంగంలో క్షీణత – 10.5 శాతం నుంచి –1.8 శాతానికి చేరింది.
♦ పెట్టుబడులకు సూచికగా ఉన్న స్థూల స్థిర మూలధన కల్పన రూ.40.03 లక్షల కోట్ల నుంచి రూ.41.18 లక్షల కోట్లకు చేరింది.
నెరవేరిన ద్రవ్యలోటు లక్ష్యం...
గడచిన ఆర్థిక సంవత్సరం కేంద్రం ద్రవ్యలోటు (వచ్చే ఆదాయం–చేసే వ్యయం మధ్య వ్యత్యాసం) లక్ష్యాన్ని సాధించింది. జీడీపీలో 3.5 శాతం ద్రవ్యోలోటును కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. విలువ రూపంలో ఇది రూ.5.35 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటులను జీడీపీలో 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది లక్ష్యం.
తలసరి ఆదాయం 9.7 % వృద్ధి
2015–16తో పోల్చిచూస్తే, 2016–17లో తలసరి ఆదాయం 9.7% పెరిగింది. ఈ విలువ రూ.94,130 నుంచి రూ. 1,03,219 కి చేరింది.
నోట్ల రద్దు ప్రభావం ఉండవచ్చు...
నాల్గవ త్రైమాసికం వృద్ధి తీరుపై డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ ఎంతవరకూ ఉంటుందన్న అంశాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అయితే మూడు, నాలుగు త్రైమాసికాలపై డీమోనిటైజేషన్ ప్రభావం కొంత ఉండి ఉండవచ్చు.– టీసీఏ అనంత్, చీఫ్ స్టాటిస్టీనియన్
తాత్కాలికమే...
డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థపై ఉంది. అయితే ఇది తాత్కాలికమే. ప్రస్తుతం వ్యవస్థలో నగదు లభ్యత (రీమోనిటైజేషన్) ప్రక్రియ పూర్తికావచ్చింది. వృద్ధి ఊపందుకుంటుంది. – అరవింద్ సుబ్రమణ్యం, సీఈఏ
రేటు తగ్గించాలి: పరిశ్రమలు
వృద్ధికి తిరిగి ఊతం అందించడానికి ఆర్‌బీఐ రెపో రేటు(ప్రస్తుతం 6.25%)ను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేశారు. దేశంలో క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని.. అయితే పెట్టుబడుల సెంటిమెంట్ మరింత మెరుగుపడాల్సి ఉంటుందని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ చెప్పారు.