1991 ఆర్థిక సరళీకరణ అనంతరం ప్రైవేట్ రంగం ఒక్కసారిగా ఉవ్వెత్తున్న ఎగిసింది. ఇదే క్రమంలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. డాలర్ల కొద్దీ వేతనాలతో ఎంబీఏ గ్రాడ్యుయేట్లను కంపెనీలు రిక్రూట్‌మెంట్ చేసుకున్నాయి. ఎంబీఏ డిగ్రీ ఉంటే చాలు.. ఇక జీవితం విజయవంతమైనట్టేనని విద్యార్థులు భావించారు. అటు మనీకి మనీ... ఇటు స్టేటస్‌కు స్టేటస్. అన్నీ ఎక్కువే. కానీ రెండు దశాబ్దాల అనంతరం ఈ ఎంబీఏ డిగ్రీ తన ప్రతిష్టతను కోల్పోయింది. ఒక్కసారిగా ఎంబీఏ సంక్షోభంలో కూరుకుపోయింది. 2016-17లో సగానికి పైగా ఎంబీఏ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో రిక్రూట్ కాలేకపోతున్నారని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డేటా తేల్చింది. కేవలం 47 శాతం ఎంబీఏ గ్రాడ్యుయేట్లు మాత్రమే ప్లేస్ అవుతున్నారని, గతేడాది కంటే ఇది 4 శాతం తక్కువేనని తెలిపింది. అంటే ఇది ఐదేళ్ల కనిష్టం.
ఎంబీఐ గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్లు పడిపోవడానికి అతిపెద్ద కారణం పాత పాఠ్య ప్రణాళికేనని తెలిసింది.టాప్ 20 కాలేజీలను మినహాయిస్తే, ఇండియన్ బిజినెస్ స్కూల్స్ నుంచి కేవలం 7 శాతం మంది ఎంబీఏ విద్యార్థులే వెంటనే ఉద్యోగాలు పొందుతున్నారని అసోచామ్ రిపోర్టు కూడా తెలిపింది. నాణ్యత నియంత్రణ, అవస్థాపన లేకపోవడం, తక్కువ వేతన ఉద్యోగాలు, నిపుణులైన అధ్యాపకులు లేకపోవడం వంటివి బీ-స్కూల్స్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలుగా అసోచామ్ వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇదే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ నియామకాలు పడిపోవడం కూడా చాలా ఎక్కువగా 12 శాతంగా ఉన్నాయి. ఈ గణాంకాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను కలుపలేదు.
Comments
Please login to add a commentAdd a comment