
ఇండిగో చెంతకు ‘ఏ320 నియో’
న్యూఢిల్లీ: యూరోపియన్‌కు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ తయారుచేసిన ‘ఏ320 నియో’ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో చెంతకు చేరింది. ఇది గురువారం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో ఆసియాలోని విమానయాన సంస్థలన్నింటిలోకెల్లా ముందుగా ‘ఏ320 నియో’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కలిగిన తొలి సంస్థగా ఇండిగో పేరుకెక్కింది. తమ సంస్థకు భారత్ ఏవియేషన్ రంగంపై ఉన్న అంకితభావానికి ఈ చర్య ప్రతీకని, కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. ప్రస్తుతమున్న ఏ320 వెర్షన్స్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కన్నా తాజా ‘ఏ320 నియో’ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇంధన సామర్థ్యం 15 శాతం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఇండిగో సంస్థ తొలిగా 2005లో 100 ఏ320ఎస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డర్ ఇచ్చింది. తర్వాత 2011లో 180 ఏ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం, 2015లో 250 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఆర్డర్లను ఇచ్చింది.