
న్యూఢిల్లీ : డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో టెక్ కంపెనీల బోణి అదిరింది. టీసీఎస్ తర్వాత దేశీయ రెండో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. క్యూ3 ఫలితాల్లో తమ నికర లాభాలు 37.7 శాతం సీక్వెన్షియల్ వృద్ధిని నమోదుచేసి, రూ.5,129 కోట్లగా రికార్డు చేసినట్టు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ లాభాలు విశ్లేషకులు అంచనా వేసిన కంటే అధికంగా ఉన్నాయి. ఈటీ నౌ పోల్ సర్వేలో ఇన్ఫోసిస్ ఈ క్వార్టర్‌లో కేవలం 3,599 కోట్ల రూపాయల లాభాలను మాత్రమే ఆర్జించనున్నట్టు విశ్లేషకులు అంచనావేశారు.
సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇన్ఫోసిస్ నికర లాభాలు 3,726 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఆ క్వార్టర్‌లో కంపెనీ రెవెన్యూలు క్వార్టర్ క్వార్టర్‌కు 1.3 శాతం పెరిగి 17,794 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. డాలర్ విలువల పరంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ సీక్వెన్షియల్‌గా 1 శాతం వృద్ధి సాధించింది. స్థిరమైన కరెన్సీ విలువల్లో ఈ వృద్ధి 0.8 శాతంగా ఉంది.
2018 ఆర్థిక సంవత్సరంలో తమ డాలర్ రెవన్యూ వృద్ధిని స్థిరమైన కరెన్సీ విలువల్లో 5.5 శాతం నుంచి 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. అంతేకాక, ఆపరేటింగ్ మార్జిన్ రేంజ్ గైడెన్స్‌ను కూడా 23 శాతం నుంచి 25 శాతంగానే ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈబీఐటీ మార్జిన్లు విశ్లేషకులు అంచనావేసిన దానికంటే అధికంగా 24.3 శాతంగా రికార్డయ్యాయి. అయితే ఈ క్వార్టర్‌లో కంపెనీ అట్రిక్షన్ రేటు మాత్రం 15.8 శాతానికి తగ్గింది. గత క్వార్టర్‌లో ఈ రేటు 17.2 శాతంగా ఉండేది. డిజిటల్ అంతరాయాన్ని ఒక పెద్ద అవకాశంగా చూడాలని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. ఐటీ సర్వీస్ మార్కెట్‌లో అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment