మోదీ అమెరికా పర్యటనకు ముందే వారందరూ...
మోదీ అమెరికా పర్యటనకు ముందే వారందరూ...
Published Tue, Jun 13 2017 3:16 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన వచ్చేనెల 25-26 తేదీల్లో జరుగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన జూలై 26న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారని వైట్ హౌజ్ వెల్లడించింది. వైట్ హౌజ్ ఈ ప్రకటన వెలువరించగానే, డొనాల్డ్ ట్రంప్ తో తమకొస్తున్న ఇబ్బందులు, ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రానికి విన్నపించేందుకు టెక్ దిగ్గజాలు కదిలివెళ్లాయి. ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, ఆయనతో పాటు పలువురు టాప్ కంపెనీ అధికారులు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సోమవారం భేటీ అయ్యారు. కీలకమార్కెట్ అయిన అమెరికా తీసుకొస్తున్న కఠినతరమైన వీసా నిబంధనలు, ఐటీ రంగంలో నెలకొన్న ఉద్యోగాల కోత వంటి అంశాలపై జైట్లీతో చర్చించినట్టు తెలుస్తోంది.
సమావేశానికి హాజరైన విశాల్ సిక్కా మాత్రం భేటీ అనంతరం ప్రొసీడింగ్స్ పై స్పందించడానికి తిరస్కరించారు. సీఓఓ యూబీ ప్రవీణ్ రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సంబంధిత వర్గాల ప్రకారం ఇన్ఫోసిస్ కంపెనీ ఈ సమావేశాన్ని కోరిందని వెల్లడైంది. ఉద్యోగాల కోతపై స్పందించిన విశాల్ సిక్కా, అమెరికాలో 10వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించాం, భారత్ లో కూడా నియామకాలు జరుపుతామని చెప్పారు. అమెరికాన్ ఉద్యోగాలను కొల్లగొడుతూ టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు హెచ్-1బీ వర్క్ వీసాలను పొందుతున్నాయని ఆ దేశం ఆరోపిస్తోంది. ఈ సమావేశంలోనే జీఎస్టీపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
Advertisement