Infosys CEO Vishal Sikka
-
ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సిక్కా
దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా వీసా సిస్టమ్ పై ఆధారపడిందని, హెచ్-1బీపై తక్కువ వేతనాలతో విదేశీయులను భారీగా నియమించుకుంటూ వీసా ప్రొగ్రామ్ ను దుర్వినియోగం పాలుచేస్తుందంటూ అమెరికా ఏకధాటిగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ ఆరోపణలు గుప్పించడమే కాకుండా, ట్రంప్ ప్రభుత్వం ఏకంగా వీసా ప్రొగ్రామ్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తోంది. అయితే దేశీయ ఐటీ ఇండస్ట్రీ అతిగా హెచ్-1బీ వీసాపై ఆధారపడిందనే ఆరోపణలను ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తీవ్రంగా ఖండించారు. ''హెచ్-1బీ వీసాలపై ఆధారపడి పనిచేస్తున్నాం అనడం సరియైనది కాదు. ఉదాహరణకు గత 10 ఏళ్లలో చూసుకుంటే, ఏడాదికి 65వేల హెచ్-1బీ వీసాలు గ్రాంట్ అయ్యాయని లెక్కలోకి వేసుకుంటే, 10ఏళ్లలో ఆ సంఖ్య 6,50,000కు పెరుగుతుంది. కానీ ఇన్ఫోసిస్ కలిగి ఉన్నది 2 లక్షల మందినే. టీసీఎస్ సంఖ్య సుమారు మాకంటే రెండింతలు ఉంటుంది అంతే'' అని సిక్కా చెప్పారు. ఈ అంచనాలను తీసుకుంటే, దేశీయ ఐటీ ఇండస్ట్రీ విపరీతంగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడిందని అనడం సరియైనది కాదని అన్నారు. హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన దేశీయ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్ పరిస్థితేమిటనే ప్రశ్నపై ఆయన ఈ విధంగా స్పందించారు. వీసా సిస్టమ్ దుర్వినియోగం పరుస్తున్నాయంటూ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.వచ్చే వారంలో డొనాల్డ్ ట్రంప్ తో తొలిసారి భేటీ కాబోతున్న మోదీ ఈ వీసా సమస్యను చర్చించబోతున్నారు. త్వరగా మార్పులు చెందుతున్న ఇన్ఫోటెక్ వాతావరణంలో గ్లోబల్ లీడర్ షిప్ స్థానంలో కొనసాగాలంటే ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఎంతో వినూత్నమైన ప్రాంతాలపై దృష్టిసారించాలని, కొత్త వాటిపై దృష్టిసారించాలని సిక్కా చెప్పారు. ఆర్టిఫియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఓపెనింగ్స్, వాయిస్ ఇంటర్ ఫేస్, ఛాట్ ఇంటర్ ఫేస్, వర్చ్యువల్ రియాల్టీ, సైబర్ సెక్యురిటీ వంటి అంశాలపై ఫోకస్ చేయాలన్నారు. -
మోదీ అమెరికా పర్యటనకు ముందే వారందరూ...
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన వచ్చేనెల 25-26 తేదీల్లో జరుగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన జూలై 26న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారని వైట్ హౌజ్ వెల్లడించింది. వైట్ హౌజ్ ఈ ప్రకటన వెలువరించగానే, డొనాల్డ్ ట్రంప్ తో తమకొస్తున్న ఇబ్బందులు, ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రానికి విన్నపించేందుకు టెక్ దిగ్గజాలు కదిలివెళ్లాయి. ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, ఆయనతో పాటు పలువురు టాప్ కంపెనీ అధికారులు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సోమవారం భేటీ అయ్యారు. కీలకమార్కెట్ అయిన అమెరికా తీసుకొస్తున్న కఠినతరమైన వీసా నిబంధనలు, ఐటీ రంగంలో నెలకొన్న ఉద్యోగాల కోత వంటి అంశాలపై జైట్లీతో చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశానికి హాజరైన విశాల్ సిక్కా మాత్రం భేటీ అనంతరం ప్రొసీడింగ్స్ పై స్పందించడానికి తిరస్కరించారు. సీఓఓ యూబీ ప్రవీణ్ రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సంబంధిత వర్గాల ప్రకారం ఇన్ఫోసిస్ కంపెనీ ఈ సమావేశాన్ని కోరిందని వెల్లడైంది. ఉద్యోగాల కోతపై స్పందించిన విశాల్ సిక్కా, అమెరికాలో 10వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించాం, భారత్ లో కూడా నియామకాలు జరుపుతామని చెప్పారు. అమెరికాన్ ఉద్యోగాలను కొల్లగొడుతూ టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు హెచ్-1బీ వర్క్ వీసాలను పొందుతున్నాయని ఆ దేశం ఆరోపిస్తోంది. ఈ సమావేశంలోనే జీఎస్టీపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. -
ఇన్ఫీ ఘనతంతా వ్యవస్థాపకులదే
సీఈఓ సిక్కా వ్యాఖ్యలు అసలుసిసలు ఎంట్రప్రెన్యూర్స్ అని ప్రశంస... బెంగళూరు: ఐటీ రంగంలో అగ్రగామిగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దిన ఘనత మొత్తం కంపెనీ సహవ్యవస్థాపకులకే చెందుతుందని సీఈఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు తొలి వ్యవస్థాపకేతర సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సిక్కా.. సంస్థ 34వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా 4.5 లక్షల మంది ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో ఈ వ్యాఖ్యలు చేశారు. నారాయణ మూర్తితో పాటు ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఆరుగురు సహ వ్యవస్థాపకులకు(నందన్ నీలేకని, ఎస్.గోపాలకృష్ణన్, ఎస్డీ శిబులాల్, కె.దినేశ్, ఎన్ఎస్. రాఘవన్, అశోక్ అరోరా) కూడా ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. శిబులాల్ గతేడాది సిక్కాకు బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. ఇక నారాయణ మూర్తి కూడా రెండోసారి చైర్మన్‌గా వచ్చినప్పటికీ.. గతేడాది జూన్‌లో ఆ పదవిని వదులుకున్నారు. ప్రస్తుతం గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘గడిచిన మూడు దశాబ్దాల వ్యవధిలో ఇన్ఫీని ఇంత అత్యున్నత స్థాయికి చేర్చిన వ్యవస్థాపకులంటే నేనెల్లప్పుడూ గౌరవిస్తా. ఐటీ సేవల్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తూ.. ఆరంభించిన ఒక కంపెనీని ఇప్పుడు ఈ రంగంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఇందుకు వాళ్లు అనుసరించిన వినూత్న మార్గాలు కంపెనీకి కొత్త విలువను చేకూర్చిపెట్టాయి’ అని సిక్కా ప్రశంసలు కురిపించారు. క్లయింట్లకు సేవలందించే విషయంలో నాణ్యతలో ఎలాంటి రాజీపడకుండా, ఎంతో బాధ్యతతో వ్యవహరించారని కూడా సీఈఓ పేర్కొన్నారు. అసలుసిసలు ఎంట్రప్రెన్యూర్స్ అంటే ఎలాఉండాలనేది తమ కంపెనీ వ్యవస్థాపకులు నిరూపించారన్నారు. ‘ఐటీ రంగంలో వేలాది మందికి మా సంస్థ వ్యవస్థాపకులు అవకాశాల ద్వారాలు తెరిచారు. ప్రధానంగా నారాయణమూర్తి నాయకత్వం, దిశానిర్ధేశం, దార్శనికత... కంపెనీ సిబ్బందిని ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. ఈ రంగం లో ఎన్నో మైలురాళ్లను నెలకొల్పిన ఘనత కూడా ఆయనదే. కార్పొరేట్ నైతిక నియమావళిలో అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఇన్ఫీకి కీర్తి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది’ అంటూ సిక్కా లేఖలో పేర్కొన్నారు. హెల్త్‌కేర్ సబ్సిడరీ కొనుగోలుకు ఓకే.. హెల్త్‌కేర్ వ్యాపార అనుబంధ సంస్థను కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారమిక్కడ జరిగిన కంపెనీ 34వ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ ఇంక్‌ను వచ్చే నెల జూన్ 1న లేదా ఆతర్వాత 10 కోట్ల డాలర్ల(దాదాపు రూ.625 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేసే ప్రత్యేక తీర్మానానికి వాటాదార్ల అనుమతి లభించినట్లు ఇన్ఫీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కంపెనీ కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్. శేషసాయి నేతృత్వంలో జరిగిన ఏజీఎంలో రూపా కుద్వాను బోర్డులో ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా నియమించేందుకు కూడా ఆమోదం తెలిపారు. కాగా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒక్క నారాయణ మూర్తి మాత్రమే భార్య సుధామూర్తితో కలిసి ఏజీఎంకు హజరయ్యారు.