ఇన్ఫీ ఘనతంతా వ్యవస్థాపకులదే
సీఈఓ సిక్కా వ్యాఖ్యలు
అసలుసిసలు ఎంట్రప్రెన్యూర్స్ అని ప్రశంస...
బెంగళూరు: ఐటీ రంగంలో అగ్రగామిగా ఇన్ఫోసిస్‌ను తీర్చిదిద్దిన ఘనత మొత్తం కంపెనీ సహవ్యవస్థాపకులకే చెందుతుందని సీఈఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు తొలి వ్యవస్థాపకేతర సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సిక్కా.. సంస్థ 34వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా 4.5 లక్షల మంది ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో ఈ వ్యాఖ్యలు చేశారు. నారాయణ మూర్తితో పాటు ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఆరుగురు సహ వ్యవస్థాపకులకు(నందన్ నీలేకని, ఎస్.గోపాలకృష్ణన్, ఎస్‌డీ శిబులాల్, కె.దినేశ్, ఎన్‌ఎస్. రాఘవన్, అశోక్ అరోరా) కూడా ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. శిబులాల్ గతేడాది సిక్కాకు బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.
ఇక నారాయణ మూర్తి కూడా రెండోసారి చైర్మన్‌గా వచ్చినప్పటికీ.. గతేడాది జూన్‌లో ఆ పదవిని వదులుకున్నారు. ప్రస్తుతం గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘గడిచిన మూడు దశాబ్దాల వ్యవధిలో ఇన్ఫీని ఇంత అత్యున్నత స్థాయికి చేర్చిన వ్యవస్థాపకులంటే నేనెల్లప్పుడూ గౌరవిస్తా. ఐటీ సేవల్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తూ.. ఆరంభించిన ఒక కంపెనీని ఇప్పుడు ఈ రంగంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఇందుకు వాళ్లు అనుసరించిన వినూత్న మార్గాలు కంపెనీకి కొత్త విలువను చేకూర్చిపెట్టాయి’ అని సిక్కా ప్రశంసలు కురిపించారు. క్లయింట్లకు సేవలందించే విషయంలో నాణ్యతలో ఎలాంటి రాజీపడకుండా, ఎంతో బాధ్యతతో వ్యవహరించారని కూడా సీఈఓ పేర్కొన్నారు.
అసలుసిసలు ఎంట్రప్రెన్యూర్స్ అంటే ఎలాఉండాలనేది తమ కంపెనీ వ్యవస్థాపకులు నిరూపించారన్నారు. ‘ఐటీ రంగంలో వేలాది మందికి మా సంస్థ వ్యవస్థాపకులు అవకాశాల ద్వారాలు తెరిచారు. ప్రధానంగా నారాయణమూర్తి నాయకత్వం, దిశానిర్ధేశం, దార్శనికత... కంపెనీ సిబ్బందిని ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. ఈ రంగం లో ఎన్నో మైలురాళ్లను నెలకొల్పిన ఘనత కూడా ఆయనదే. కార్పొరేట్ నైతిక నియమావళిలో అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఇన్ఫీకి కీర్తి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది’ అంటూ సిక్కా లేఖలో పేర్కొన్నారు.
హెల్త్‌కేర్ సబ్సిడరీ కొనుగోలుకు ఓకే..
హెల్త్‌కేర్ వ్యాపార అనుబంధ సంస్థను కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారమిక్కడ జరిగిన కంపెనీ 34వ ఏజీఎంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ ఇంక్‌ను వచ్చే నెల జూన్ 1న లేదా ఆతర్వాత 10 కోట్ల డాలర్ల(దాదాపు రూ.625 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేసే ప్రత్యేక తీర్మానానికి వాటాదార్ల అనుమతి లభించినట్లు ఇన్ఫీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కంపెనీ కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్. శేషసాయి నేతృత్వంలో జరిగిన ఏజీఎంలో రూపా కుద్వాను బోర్డులో ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా నియమించేందుకు కూడా ఆమోదం తెలిపారు. కాగా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒక్క నారాయణ మూర్తి మాత్రమే భార్య సుధామూర్తితో కలిసి ఏజీఎంకు హజరయ్యారు.