ఇన్ఫోటెక్ ఇక సైయంట్
- 3-5 ఏళ్లలో బిలియన్ డాలర్లకు
- ప్రత్యేక గుర్తింపుకై పేరు మార్పు
- ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌ను 1991లో స్థాపించాను. పెట్టుబడి రూ.20 లక్షలు. 6 వేల మంది వాటాదారులున్నారు. నేడు కంపెనీ మార్కెట్ విలువ రూ.4,000 కోట్లకు చేరుకుంది. వాటాదారుల పెట్టుబడికి విలువ చేకూర్చాం. మూడు నుంచి ఐదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదుగుతాం. ఈ లక్ష్యంతోపాటు నిర్వహణ లాభం పెంపు, కస్టమర్లు, ఉద్యోగుల సంతృప్తి కూడా మాకు ముఖ్యం అని అంటున్నారు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి. సంస్థ నూతన పేరు సైయంట్ లిమిటెడ్‌ను అధికారికంగా ప్రకటించిన అనంతరం బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇన్ఫోటెక్ పేరు సాధారణంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా నూతన అధ్యాయం రాసేందుకే పేరు మార్చినట్టు పేర్కొన్నారు. సైన్స్, క్లయింట్, ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌ల సమ్మేళనమే సైయంట్‌గా అభివర్ణించారు. 12 రంగాల్లో సేవలందిస్తున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్, నెట్‌వర్క్స్, ఆపరేషన్స్ ఇలా ఆరు విభాగాల్లో నాయకత్వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం ఆదాయంలో 98 శాతం పాత క్లయింట్ల నుంచే సమకూరుతోందని వివరించారు.
ఈ ఏడాదీ నియామకాలు..
గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ నికరంగా 1,500 మందిని నియమించింది. 2014-15లో 1,500-1,800 మందిని నియమించనుంది. మూడేళ్లలో కాకినాడ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,000 నుంచి 2 వేలకు పెంచనున్నారు. వైజాగ్ కేంద్రంలో 300 మంది ఉద్యోగులున్నారు. రెండేళ్లలో 700 మందిని అదనంగా జతచేయనున్నారు.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి 500-600 మంది ఫ్రెషర్లను కంపెనీలోకి తీసుకుంటామని సైయంట్ ఎండీ, సీఈవో కృష్ణ బోదనపు సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. సిబ్బందిని ఇబ్బడిముబ్బడిగా చేర్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఉద్యోగి ద్వారా 30 వేల డాలర్ల ఆదాయాన్ని కంపెనీలు ఆశిస్తాయి. ఇప్పు డు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల వ్యాపార విధానాలు మారిపోయాయి. ఏటా నికరంగా ఎంత మందిని నియమించుకునేది చెప్పలేమన్నారు.
మంచి నాయకత్వంతోనే..
సాఫ్ట్‌వేర్ రంగం గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మందకొడిగా ఉంది. విభజన కారణంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. విభజన ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్‌కు మంచి రోజులొస్తాయి. దూరదృష్టి ఉన్న నాయకత్వంతోనే ఇది సాధ్యపడుతుందని మోహన్‌రెడ్డి అన్నారు. ‘సీమాంధ్రలో వైజాగ్‌తోపాటు ఇతర ప్రధాన నగరాలు అంతర్జాతీయంగా అనుసంధానమవ్వాలి. మంచి పాఠశాలలు, ఆధునిక వైద్యం అందుబాటులోకి రావాలి. అప్పుడే ఉద్యోగులు పనిచేసేందుకు, అలాగే పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తాయి.
హైదరాబాద్ మాదిరిగా ఈ ప్రాంతంలోనూ అభివృద్ధి సాధ్యపడుతుంది. మాల్స్, మల్టీప్లెక్స్‌లున్న నగరాల్లో పని చేయడానికే ఉద్యోగులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రాలాసియా మార్కెట్లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపాదిత ఐటీఐఆర్‌లో పెట్టుబడులు రావాలంటే మెట్రో రైల్ వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.