Infotech Enterprises
-
ఇన్ఫోటెక్ ఇక సైయంట్
- 3-5 ఏళ్లలో బిలియన్ డాలర్లకు - ప్రత్యేక గుర్తింపుకై పేరు మార్పు - ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌ను 1991లో స్థాపించాను. పెట్టుబడి రూ.20 లక్షలు. 6 వేల మంది వాటాదారులున్నారు. నేడు కంపెనీ మార్కెట్ విలువ రూ.4,000 కోట్లకు చేరుకుంది. వాటాదారుల పెట్టుబడికి విలువ చేకూర్చాం. మూడు నుంచి ఐదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదుగుతాం. ఈ లక్ష్యంతోపాటు నిర్వహణ లాభం పెంపు, కస్టమర్లు, ఉద్యోగుల సంతృప్తి కూడా మాకు ముఖ్యం అని అంటున్నారు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి. సంస్థ నూతన పేరు సైయంట్ లిమిటెడ్‌ను అధికారికంగా ప్రకటించిన అనంతరం బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ఫోటెక్ పేరు సాధారణంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా నూతన అధ్యాయం రాసేందుకే పేరు మార్చినట్టు పేర్కొన్నారు. సైన్స్, క్లయింట్, ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ల సమ్మేళనమే సైయంట్‌గా అభివర్ణించారు. 12 రంగాల్లో సేవలందిస్తున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్, నెట్వర్క్స్, ఆపరేషన్స్ ఇలా ఆరు విభాగాల్లో నాయకత్వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం ఆదాయంలో 98 శాతం పాత క్లయింట్ల నుంచే సమకూరుతోందని వివరించారు. ఈ ఏడాదీ నియామకాలు.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ నికరంగా 1,500 మందిని నియమించింది. 2014-15లో 1,500-1,800 మందిని నియమించనుంది. మూడేళ్లలో కాకినాడ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,000 నుంచి 2 వేలకు పెంచనున్నారు. వైజాగ్ కేంద్రంలో 300 మంది ఉద్యోగులున్నారు. రెండేళ్లలో 700 మందిని అదనంగా జతచేయనున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి 500-600 మంది ఫ్రెషర్లను కంపెనీలోకి తీసుకుంటామని సైయంట్ ఎండీ, సీఈవో కృష్ణ బోదనపు సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. సిబ్బందిని ఇబ్బడిముబ్బడిగా చేర్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఉద్యోగి ద్వారా 30 వేల డాలర్ల ఆదాయాన్ని కంపెనీలు ఆశిస్తాయి. ఇప్పు డు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల వ్యాపార విధానాలు మారిపోయాయి. ఏటా నికరంగా ఎంత మందిని నియమించుకునేది చెప్పలేమన్నారు. మంచి నాయకత్వంతోనే.. సాఫ్ట్వేర్ రంగం గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మందకొడిగా ఉంది. విభజన కారణంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. విభజన ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్‌కు మంచి రోజులొస్తాయి. దూరదృష్టి ఉన్న నాయకత్వంతోనే ఇది సాధ్యపడుతుందని మోహన్‌రెడ్డి అన్నారు. ‘సీమాంధ్రలో వైజాగ్‌తోపాటు ఇతర ప్రధాన నగరాలు అంతర్జాతీయంగా అనుసంధానమవ్వాలి. మంచి పాఠశాలలు, ఆధునిక వైద్యం అందుబాటులోకి రావాలి. అప్పుడే ఉద్యోగులు పనిచేసేందుకు, అలాగే పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తాయి. హైదరాబాద్ మాదిరిగా ఈ ప్రాంతంలోనూ అభివృద్ధి సాధ్యపడుతుంది. మాల్స్, మల్టీప్లెక్స్లున్న నగరాల్లో పని చేయడానికే ఉద్యోగులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రాలాసియా మార్కెట్లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపాదిత ఐటీఐఆర్‌లో పెట్టుబడులు రావాలంటే మెట్రో రైల్ వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. -
టేకోవర్లపై ఇన్ఫోటెక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ మార్చితో ముగిసిన త్రైమాసిక ఆదాయ, నికర లాభాల్లో 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.54 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.70 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.464 కోట్ల నుంచి రూ. 595 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద ఇన్ఫోటెక్ రూ.2,206 కోట్ల ఆదాయంపై రూ. 266 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్ఫోటెక్ చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ ఆదాయం తొలిసారిగా రూ.2,000 కోట్ల మార్కును అధిగమించిందన్నారు. గడిచిన రెండు త్రైమాసికాల నుంచి వ్యాపారంలో వృద్ధి కనిపిస్తోందని, ఈ ఏడాది కూడా ఇదే విధమైన వృద్ధి కొనసాగే అవకాశం ఉందన్నారు. వాటాదారులకు 60 శాతం (షేరుకు రూ.3) డివిడెండ్‌ను ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం డివిడెండ్‌ను ఇన్ఫోటెక్ ఇచ్చినట్లయ్యింది. కుమారుడికి పగ్గాలు ఇన్ఫోటెక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్‌గా కృష్ణ బోధనపు నియమితులయ్యారు. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుందని, నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. యువతకి ప్రాధాన్యతనివ్వాలన్న ఉద్దేశ్యంతో తన కుమారుడికి ఈ కీలక బాధ్యతలను అప్పచెప్పామని, ఇక నుంచి తాను కేవలం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. 2001లో ఇన్ఫోటెక్లో చేరిన కృష్ణ వివిధ హోదాల్లో పనిచేశారు. గత రెండేళ్ల నుంచి కృష్ణ ప్రెసిడెంట్, సీవోవోగా వ్యవహరిస్తున్నారు. ఇతర కంపెనీలను కొనుగోళ్లు చేయడం ద్వారా వేగంగా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఇన్ఫోటెక్ సీఈవో, ఎండి కృష్ణ బోధనపు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విలేకరులతో మాట్లాడుతూ తమ దగ్గరున్న రూ.726 కోట్ల నగదు నిల్వలను ఉపయోగించి కంపెనీలను కొనుగోళ్ళు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివెసైస్ రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ప్రస్తుతం ఉన్న విభాగాలను పటిష్టం చేసే విధంగా ఈ కొనుగోళ్లు ఉంటాయన్నారు. 20 నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలపై దృష్టిసారించామని, వచ్చే ఆరు నెలలలోపు ఒక కంపెనీని కొనుగోలు చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఇన్ఫోటెక్ లాభం రూ.69.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ ఇన్ఫోటెక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయంలో 22 శాతం, నికరలాభంలో 12 శాతం వృద్ధిని కనపర్చింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.475 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరగా, నికరలాభం రూ. 62 కోట్ల నుంచి రూ. 69 కోట్లకు చేరింది. గత నాలుగు త్రైమాసికాలుగా ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశామని, రానున్న కాలంలో కూడా ఇదే వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం నాలుగు విభాగాల పనితీరు బాగున్నప్పటికీ మూడు విభాగాలు రికార్డుస్థాయి వృద్ధిని నమోదు చేశాయన్నారు. యూరప్ బాగుంది: సమీక్షా కాలంలో యూరప్ ఆదాయంలో 10 శాతం, అమెరికా ఆదాయంలో 7 శాతం వృద్ధిని ఇన్ఫోటెక్ నమోదు చేసింది. మొత్తం మీద ఆదాయంలో చూస్తే ఆమెరికా వాటా తగ్గి యూరప్ వాటా పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 61 శాతం నుంచి 57 శాతానికి తగ్గితే, యూరప్ వాటా 25 నుంచి 29 శాతానికి పెరిగింది. ఈ త్రైమాసికంలో కొత్తగా 11 మంది కస్టమర్లు వచ్చి చేరగా, 801 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం వదిలివెళ్ళిన వారిని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 319 మందిని తీసుకున్నట్లు చెప్పారు. మార్కెట్ అంచనాలను మించి ఫలితాలను ఇవ్వడంతో గురువారం ఎన్ఎస్ఈలో ఇన్ఫోటెక్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం పెరిగి రూ.347 వద్ద ముగిసింది. -
33 శాతం పెరిగిన ఇన్ఫోటెక్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో నికర లాభం 33 శాతం పెరిగి రూ.72.5 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.50.31 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ సమీక్షా కాలంలో ఆదాయం 14% వృద్ధితో రూ.477 కోట్ల నుంచి రూ.549 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఆదాయం రూ.500 కోట్లు దాటడం, అలాగే ఆరు నెలల్లో రూ.1,000 కోట్లు దాటడం ఇదే ప్రథమం అని కంపెనీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూపాయి క్షీణత వలన మార్జిన్లు పెరిగాయని, ఆ మేరకు లాభాలు పెరిగినట్లు ఇన్ఫోటెక్ సీఎఫ్‌వో అజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే ఈ మూడు నెలల కాలంలో 1,195 మంది ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా కంపెనీ మరో రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ గత కొన్ని త్రైమాసికాలుగా స్థిరమైన వృద్ధిరేటును నమోదు చేస్తున్నామని, వచ్చే ఆరు నెలల కాలంలో కూడా ఇదే విధమైన వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా 15 కస్టమర్లు వచ్చి చేరగా ఇందులో రెండు ఖాతాలు 20 మిలియన్ డాలర్ల విలువైనవని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రతీ షేరుకు రూ.2 (40 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటిస్తూ కంపెనీ బోర్డు డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.